తప్పు తెలుసుకున్న ఏఎంబీ సినిమాస్

SMTV Desk 2019-02-22 17:07:52  AMB Multiplex, Maheshbabu, GST

హైదరాబాద్, ఫిబ్రవరి 22: సూపర్ స్టార్ మహేష్ బాబు సొంత మల్టీప్లెక్స్‌ ఏఎంబీ సినిమాస్‌ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ థియేటర్ లో టికెట్ రేట్ల విషయంలో నిబంధనలను పాటించడం లేదని, జీఎస్టీని కేంద్రం తగ్గించినా, ఆ మేరకు ప్రయోజనాలను ప్రేక్షకులకు అందించలేదని ఆరోపిస్తూ, షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఏఎంబీ సినిమాస్‌ నేరం అంగీకరించి ప్రభుత్వానికి ఎగ్గొట్టిన రూ.35.66 లక్షల జీఎస్టీని గురువారం చెల్లించింది.

జనవరి 1 నుంచి సినిమా టికెట్లపై పన్ను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. అయితే పన్ను రేట్లను తగ్గించకుండా గత పన్నురేట్లతోనే టికెట్లను అమ్మారు. దీంతో కేంద్ర జీఎస్టీ అధికారులు ఇటీవల దాడులు చేసి కేసులు పెట్టారు. జనవరి 1 నుంచి ఈనెల 5 వరకు ఎక్కువ మొత్తం వసూలుచేసినట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా అధికంగా వసూలు చేసిన రూ.35.66 లక్షల(పన్ను)ను చెల్లించాలని ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు ఏఎంబీ సినిమాస్ పన్ను చెల్లించింది. ఈ మొత్తాన్ని అధికారులు వినియోగదారుల సంక్షేమ నిధి కింద జమ చేయనున్నారు. కాగా, టికెట్ల లావాదేవీలు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ పరిధిలో ఉండడంతో తాము ధరలు తగ్గించలేదని ఏఎంబీ సంజాయిషీ ఇచ్చింది.