కొద్ది రోజుల్లో టీడీపీ ఖాళీ అవ్వడం ఖాయం: రోజా

SMTV Desk 2019-02-22 15:35:46  Roja, Jaganmohan Reddy, Chandrababu Naidu, TDP, YCP, KCR, Narendra Modi

అమరావతి, ఫిబ్రవరి 22: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలోకి వ‌ల‌స‌లపై కేసీఆర్, మోదీ కుట్ర ఉందంటూ చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లను రోజా తిప్పికొట్టారు. చంద్రబాబు రాజకీయ విధానాలు నచ్చకే ఆ పార్టీ నేతలు టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నారని రోజా తేల్చి చెప్పారు.

నిజంగానే కేసీఆర్, మోదీ క‌లిసి కుట్ర చేస్తే, టీడీపీలో ఒక్క‌రు కూడా మిగ‌ల‌ర‌ని రోజా హెచ్చ‌రించారు. ప్ర‌స్తుతం రాష్ట్ర‌మంతా తెలుగు దేశం పార్టీ పై అసంతృప్తితో ఉందని, జ‌గ‌న్ రాష్ట్ర‌మంతా కాలి న‌డ‌క‌న తిరిగి, ఎంతో క‌ష్ట‌ప‌డి త‌న బ‌లాన్ని పెంచుకున్నార‌ని, దీంతో రాష్ట్ర‌మంతా వైసీపీ వైపు మళ్ళుతుందని పేర్కొన్నారు. అందుకే టీడీపీ ప్రముఖ నేతలు కూడా వైసీపీలోకి వ‌స్తున్నార‌ని, వ‌చ్చే ప్ర‌తి నాయ‌కుడు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి మ‌రీ వ‌స్తున్నార‌ని, జ‌గ‌న్ నైతిక విలువ‌ల‌కు ఎంత ప్రాముఖ్యం ఇచ్చారన్న దానికి ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని రోజా అన్నారు.

కానీ చంద్రబాబు మాత్రం వైసీపీ నుంచి కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారంటూ ఆమె ధ్వజమెత్తారు. ఇక ద‌ళితుల పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ పై చంద్ర‌బాబు చ‌ర్య‌లు తీసుకునే ద‌మ్ముందా అని ప్రశ్నించారు. గతంలో చంద్ర‌బాబే ద‌ళితుల‌ను అవ‌మానించార‌ని రోజా మండిపడ్డారు. బాబు టైమ్ ద‌గ్గ‌ర ప‌డింద‌ని, కొద్ది రోజుల్లో టీడీపీ మొత్తం ఖాళీ అయిపోవ‌డం ఖాయ‌మ‌ని రోజా విమర్శించారు.