పోలీసును పట్టించిన దొంగలు

SMTV Desk 2019-02-22 15:33:48  Rangareddy Police, Maheshwaram, ACB

రంగారెడ్డి, ఫిబ్రవరి 22: పోలీసులు దొంగలని పట్టుకోవడం సాధారణమైన విషయం. అయితే ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో దొంగలే పోలీసులను ఏసీబీకి పట్టించారు. మహేశ్వరం మండలం అమీర్‌పేటకు చెందిన రాజు, మెయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లికి చెందిన నజీర్ ముఠాగా ఏర్పడి పశువులను దొంగలిస్తున్నారు. దొంగిలించిన పశువులను రుద్రారంలోని అల్‌కబీర్ వధశాలలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

వరుసగా పశువుల దొంగతనాలు జరుగుతుండడంతో మహేశ్వరం పోలీసులు రంగంలోకి దిగారు. కేసు విచారణ జరిపి నజీర్, రాజులే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తుంచారు. అయితే ఎస్సై జి.నర్సింహులు వారిని కలిసి అరెస్ట్ చేయకుండా ఉండడానికి లంచం అడిగాడు. తనకు లంచం ఇస్తే కేసు తీవ్రతను తగ్గిస్తానని, అందుకు రూ.1. 60 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

దొంగిలించిన పశువులను కొనుగోలు చేస్తున్న హర్షద్ పేరు ఎఫ్‌ఐఆర్‌లో లేకుండా చేసేందుకు మరో రూ.10 వేలు ఇవ్వాలని కోరాడు. దీంతో ఆ దొంగలు ఏసీబీని ఆశ్రయించారు. గతంలో రూ. 60 వేలు తీసుకున్న ఎస్సై నర్సింహులును గురువారం మరో రూ. 80 వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.