అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి ఒప్పుకోలేదని ఇలా చేసాడు

SMTV Desk 2019-02-22 15:29:38  Tenali, Murder

తెనాలి, ఫిబ్రవరి 22: ఓ మానవ మృగం చేతిలో మరో యువతీ ప్రాణాలు కోల్పోయింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని గొంతుకోసి దారుణంగా హత్య చేసి అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు నిందితుడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బిట్రా సుధాకర్, దుర్గాభవాని దంపతులు పట్టణ ఇస్లాంపేటలోని హిందూ ముస్లిం రోడ్డులో నివసిస్తున్నారు. వస్త్ర దుకాణాల్లో పనిచేసే వీరికి కుమారుడు ప్రవీణ్‌ మరియు కుమార్తె శ్రీజ్యోతి (20) ఉన్నారు. ఆమెకు పెళ్లిసంబంధం మాట్లాడేందుకని సుధాకర్‌ దంపతులు గురువారం తెల్లవారుజామునే ఏలూరు బయలుదేరి వెళ్లారు.

ప్రవీణ్ పని నిమిత్తం ఆటోనగర్ వెళ్ళగా.....ఇదే అదునుగా చూసుకున్న శ్రీజ్యోతి తండ్రి సుధాకర్‌ స్నేహితుడు నేతికుంట్ల సత్యనారాయణ(42) ఇంట్లో ఒంటరిగా ఉన్న శ్రీజ్యోతిపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేసాడు. కుటుంబ వివాదాల కారణంగా సత్యనారాయణ ఒంటరిగా జీవిస్తున్నాడు. స్నేహితుడిగా అన్ని అవసరాలకు సుధాకర్‌ కుటుంబానికి ఆసరాగా ఉంటూ వచ్చాడు.

అయితే తన కుమారుడి వయస్సున్న శ్రీజ్యోతిపై కన్నేసిన సత్యనారాయణ ఆమెను వివాహం చేసుకుంటానని పరోక్షంగా అడిగినట్లు తెలుస్తుంది. ఈ విషయంపై సత్యనారాయణను సుధాకర్ దంపతులు నిలదీయగా....... "నేనెందుకు అన్నాను..చిన్నపిల్లకదా......సరదాగా అన్నాను" అని మాట మార్చేసాడు. జ్యోతిని వివాహం చేసుకోడానికి తల్లిదండ్రులు ఒప్పుకోక పోవడంతో కక్ష పెంచుకొని సత్యనారాయణ ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు.