బ్రేకింగ్ - మరో ఉగ్ర దాడి కుట్ర : ఇంటలిజెన్స్ వర్గాలు

SMTV Desk 2019-02-21 19:58:51  

పుల్వామా తరహాలో మరోసారి దాడి చేసేందుకు జైషే ఏ మహ్మద్‌ ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు భద్రతా బలగాలను హెచ్చరించినట్లు తెలుస్తోంది. రానున్న రెండు రోజుల్లో జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో జేఈఎం ఉగ్రవాదులు భారీ ఎత్తున ఆత్మాహుతి దాడులు, ఐఈడీ పేలుళ్లు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరో ఆత్మాహుతి దాడికి గ్రీన్‌ స్కార్పియోను సిద్ధం చేసినట్లు ఏజెన్సీకి సమాచారం అందింది. అలాగే నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుదారులు ప్రవేశించే అవకాశం కూడా ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. గురేజ్‌ సెక్టార్‌లోకి చొరబడేందుకు ఐదు నుంచి ఆరుగురు ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

జేఈఎం ఉగ్రవాదులు సామాజిక మాధ్యమాల్లో పంపించుకున్న సందేశాలను డీకోడ్‌ చేయడంతో ఈ విషయం బయటపడినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ దఫా దాడి చేసేందుకు దాదాపు 500 కేజీల పేలుడు పదార్థాలను ఉపయోగించేందుకు జేఈఎం ఉగ్రవాదులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు డీకోడ్‌ చేసిన సందేశాల ద్వారా బయటపడింది. కశ్మీరీలను భద్రతా బలగాలు వేధించడం ఆపకపోతే దాడులు మరింత ఎక్కువ చేస్తామని సదరు ఉగ్రవాదులు హెచ్చరించినట్లు సమాచారం. ‘ఈ పోరాటం మీకు మాకు మధ్య. వచ్చి మాతో పోరాడండి. మేం సిద్ధంగా ఉన్నాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే’ అంటూ ఉన్న ఓ సందేశాన్ని ఇంటెలిజెన్స్‌ వర్గాలు డీకోడ్‌ చేశాయి. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఈనెల 14న జేఈఎం ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడి 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ దాడి గురించి జేఈఎం ఉగ్రవాదులు ముందే హెచ్చరించారు.