ఇమ్రాన్ ఖాన్ కి కీలక సూచనలు చేసిన సునీల్ గవాస్కర్

SMTV Desk 2019-02-21 16:30:05  

క్రికెట్ లో భారత్ పాక్ మ్యాచ్ అంటే నే అదొక రకమైన పోరు కనపడుతుంది. సరిహద్దుల్లో ఫైట్ లాగ సీరియస్ గా మ్యాచ్ ని ఆడతారు అలానే ప్రేక్షకులు ఆ మ్యాచ్ ని వీక్షిస్తారు. భారత్, పాక్ ఆటగాళ్ళ మధ్య కూడా పచ్చ గడ్డి వేస్తె భగ్గు మనేలా మ్యాచ్ లు కొనసాగుతాయి. కాని కొందరు ఆటగాళ్ళు స్నేహ పూర్వకంగా వుంటారు. ఒకప్పుడు క్రికెట్ లో మాజీ పాక్ క్రికెటర్, ఇప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఇండియన్ లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ మంచి స్నేహితులు. పుల్వామా దాడి విషయంలో సునీల్ గవాస్కర్, ఇమ్రాన్ ఖాన్ కి కొన్ని సూచనలు చేసాడు అది స్నేహపూర్వకంగా చేస్తున్నట్లు అతను తెలిపాడు. ఇండియా ఒక అడుగు వేస్తే, పాక్ రెండు అడుగులు వేస్తుంది అన్నావు కదా, ఆ స్నేహపూర్వక అడుగులేదో ముందు నువ్వే వెయ్యి.. తర్వాత ఇండియా ఎన్ని అడుగులు వేస్తుందో చూడు అని ఇమ్రాన్‌ను గవాస్కర్ కోరాడు. పుల్వామా దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించు.. సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపెయ్.. చొరబాట్లను కట్టడి చెయ్.. అప్పుడు భారత్ ఎన్ని అడుగులు వేస్తుందో చూడు అంటూ ఇమ్రాన్‌కు చెప్పాడు. పాక్ ప్రధాని అయిన తర్వాత ఇమ్రాన్‌ను తాను కలవలేదని అన్నాడు. తాను చెప్పింది కనీసం ఇమ్రాన్ వింటాడా లేదా కూడా తనకు తెలియదని, ఒకవేళ వింటే మాత్రం అతని సమాధానం కోసం ఎదురు చూస్తానని సన్నీ స్పష్టం చేశాడు. ఒకప్పుడు క్రికెట్ నుంచి రిటైరవుతానని తాను చెబితే ఇమ్రాన్ వద్దన్నాడని, అప్పుడు అతని మాట తాను విన్నానని, ఇప్పుడు తన మాట ఇమ్రాన్ వినాలని లిటిల్ మాస్టర్ చెప్పాడు. ఇమ్రాన్ ఇలా స్నేహ పూర్వక అడుగులు వేసినప్పుడే అది నయా పాకిస్థాన్ అవుతుందని గవాస్కన్ అన్నాడు. ఓ క్రికెటర్‌గా, టూరిస్టుగా ఇమ్రాన్ చాలాసార్లు ఇండియా వచ్చాడు. ఇండియన్స్ గురించి ఏ పాక్ ప్రధానికీ తెలియనంత ఇమ్రాన్‌కు తెలుసు. నేను అతని నుంచి మాటలు కోరుకోవడం లేదు. చర్యలు తీసుకోవాలని అడుగుతున్నా అని గవాస్కర్ చెప్పాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌తో స్నేహపూర్వక సంబంధాలు అత్యవసరం అని అభిప్రాయపడ్డాడు.