ఈ ఇద్దరు యువ క్రికెటర్లు ప్రపంచకప్‌ కు కీలకం : టీం ఇండియా మాజీ క్రికెటర్

SMTV Desk 2019-02-13 21:11:09  World cup 2019, Team india, Rishab pant, Vijay shankar, Lakshmipathi balaji

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న వరల్డ్ కప్ మెగా టోర్నీలో భాగంగా భారత ఆటగాళ్ల ఎంపికను సెలెక్టర్లు ప్రారంభించారు. భారత జట్టును సీనియర్లు, జూనియర్లతో సమతూకంతో ఎంపిక చేయనున్నట్లు చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇప్పటికే వెల్లడించాడు. ఈ మధ్యే మంచి ఫామ్ తో అత్యుత్తమంగా ఆడుతున్న యువ ఆటగాళ్లు రిషబ్ పంత్, విజయ్ శంకర్ ల పేర్లను వరల్డ్ కప్ కోసం పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ యువ ఆటగాళ్లకు టీంఇండియా మాజీల నుండి కూడా సపోర్ట్ లభిస్తోంది.





తాజాగా భారత మాజీ ఆటగాడు లక్ష్మీపతి బాలాజి కూడా రిషబ్ పంత్, విజయ్ శంకర్ లకు మద్దతుగా నిలిచారు. వీరిద్దరిని ఎంపిక చేయడం ద్వారా టీంఇండియా బ్యాటింగ్ లైనప్ మరింత బలపడుతుందని బాలాజీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా విజయ్ శంకర్ ఈ మధ్య కాలంలో మరింత మెరుగ్గా రాణిస్తున్నాడని బాలాజీ ప్రశంసించారు. ప్రపంచ కప్ ఆడేందుకు అతడికి అన్ని అర్హతలు వున్నాయని పేర్కొన్నారు. అతడి ఆటతీరుపై విమర్శలే ఎదురైన ప్రతిసారి అతడు తన బ్యాట్ తో సమాధానం చెబుతున్నాడని బాలాజి అన్నాడు.

ఇటీవల ముగిసిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటనలో కూడా విజయ్ తనను తాను నిరూపించుకున్నాడని బాలాజీ గుర్తుచేశారు. రిషబ్ పంత్, విజయ్ శంకర్ లాంటి ఆటగాళ్లు ఇంగ్లాండ్ లో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో రాణించగలరని బాలాజి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి ఈ ఇద్దరు యువ క్రికెటర్లకు ప్రపంచకప్‌ ఆడించాలని బాలాజీ పేర్కొన్నారు.