అమెరికాలో అరెస్ట్ అయిన భారతీయ విద్యార్ధులు త్వరలో విడుదల...

SMTV Desk 2019-02-13 16:22:14  Indian Students, America, Farmingaton University, Fake University

అమెరికా, ఫిబ్రవరి 13: కొద్ది రోజుల క్రితం ఫార్మింగటన్ యూనివర్శిటీ కేసులో అరెస్ట్ అయిన భారతీయ విద్యార్ధులకు జైళ్ళ నుంచి విముక్తి లభించనుంది. రెండు తెలుగు సంఘాల కృషి వలన 16 మంది విద్యార్ధులను జైళ్ళ నుంచి విడుదలచేసి స్వదేశానికి పంపించేందుకు కోర్టు అంగీకరించింది.

ఈ నెల 26వ తేదీలోగా అందరూ స్వదేశానికి తిరిగి వెళ్లవలసిందిగా కోర్టు ఆదేశించింది. అందుకు విద్యార్ధులు కూడా అంగీకరించడంతో వారిని స్వదేశానికి తిప్పి పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అరెస్ట్ అయిన విద్యార్ధులు ఇంకా కేలహోన్ కౌంటీ, మన్రో కౌంటీ జైళ్ళలోనే ఉన్నారు. త్వరలోనే వారందరూ విడుదలకాబోతున్నారు.

అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ మరియు ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్లు విద్యార్ధులకు అవసరమైన న్యాయసహాయాన్ని అందించడమే కాకుండా అమెరికన్ కాంగ్రెస్‌ సభ్యులను, అమెరికాలో భారత్ ఎంబసీ అధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చి అరెస్ట్ అయిన విద్యార్ధులను విడిపించేందుకు వారి సహాయసహకారాలు కూడా తీసుకున్నారు.

అమెరికాలో ఈ రెండు తెలుగు సంఘాలు చొరవ తీసుకొని పూనుకోకపోయుంటే విద్యార్ధులు నేటికీ జైళ్లలోనే మగ్గుతుండేవారు. మిగిలిన విద్యార్ధులను కూడా విడిపించేందుకు కృషి చేస్తున్నామని రెండు తెలుగు సంఘాల ప్రతినిధులు తెలిపారు. వెంకట్ మంతెన అధ్వర్యంలో అమెరికన్ తెలంగాణ అసోసియేషన్, సతీష్ వేమన అధ్వర్యంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం సభ్యులు విద్యార్ధులను విడిపించేందుకు చాలా కృషి చేశారు. అందుకు వారందరికీ అభినందనలు.