ఈ సారి ప్రపంచకప్‌ మాదే...భారత్ ను చిత్తు చేస్తాం : పాక్ మాజీ కెప్టెన్

SMTV Desk 2019-02-13 14:09:03  Moin khan, Pakistan cricketer, World Cup, India VS Pakistan

పాకిస్తాన్, ఫిబ్రవరి 13: త్వరలో జరగనున్న క్రికెట్ ప్రపంచకప్‌లో ఈ సారి ఖచ్చితంగా భారత్ పై పాకిస్తాన్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్. తాజాగా ఇస్లామాబాద్‌లో ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన ఆయన ద్వైపాక్షిక మ్యాచ్‌ల్లో భారత్‌పై పాక్ దే పైచేయి అని, కానీ ప్రపంచకప్‌లలో మాత్రం ఇప్పటి వరకు ఇండియాపై పాక్ గెలవలేకపోయిందన్నాడు.

ఆరు ప్రపంచకప్‌లలో భారత్, పాకిస్థాన్‌లు తలపడగా ప్రతిసారి ఇండియానే గెలిచిందని, అయితే ఈసారి మాత్రం ఆ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర తిరిగరాస్తామని మొయిన్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుత పాకిస్తాన్ జట్టులో నైపుణ్యమున్న ఆటగాళ్లకు ఏం కొదవలేదన్నాడు. కెప్టెన్‌ సర్ఫరాజ్ అహ్మద్ జట్టును అద్బుతంగా మార్చాడని, టీమ్‌ను ముందుండి నడిపిస్తున్నాడని చెప్పుకొచ్చాడు.

భారత్‌పై ప్రపంచకప్‌లో గెలిచే సత్తా పాక్ జట్టుకు ఉందని రెండేళ్ల కిందట ముగిసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ను పాక్ చిత్తు చిత్తుగా ఓడించిన విషయాన్ని ఈ సందర్భంగా మొయిన్ ఖాన్ గుర్తు చేశాడు. వరల్డ్‌కప్‌కు ఆతిథ్యిమిస్తున్న ఇంగ్లాండ్ పరిస్థితులకు తగ్గట్టుగా పాక్ జట్టులో నాణ్యమైన బౌలర్లు ఉన్నారని అతను ధీమా వ్యక్తం చేశాడు.

టోర్నీకి మూడు వారాల ముందే ఇంగ్లాండ్ వెళ్లి ప్రాక్టీస్‌లో పాల్గొవడం కూడా పాకిస్తాన్‌కు కలిసి వస్తుందని అభిప్రాయపడ్డారు. మే మరియు జూన్ నెలల్లో ఇంగ్లాండ్ పిచ్‌లపై ఉండే తేమ పాక్ బౌలర్లకు ఉపకరిస్తుందని మొయిన్ ఖాన్ స్పష్టం చేశాడు. 1992, 1996 వరల్డ్‌కప్‌లలో ఇండియాతో ఆడిన పాక్ జట్టులో మొయిన్ ఖాన్ సభ్యుడిగా ఉన్నాడు. మరోవైపు 2019 ప్రపంచకప్‌లో భారత్-పాక్‌లు జూన్ 16న తలపడనున్నాయి.