జూ.ఎన్టీఆర్, పవన్ లతో ఎలాంటి విభేదాలు లేవు : నారా లోకేశ్

SMTV Desk 2017-08-03 12:51:20  NARAA LOKESH TALKS ABOUT PAWAN KALYAAN AND JUNIOR NTR

అమరావతి, ఆగష్టు 3 : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "తనకు సీఎం కావాలనే ఆలోచనే లేదు. నేను ప్రజలకు సేవ చెయ్యాలి. నాకు మంత్రి పదవే చాలా ఎక్కువ. దీనికే, నేను న్యాయం చెయ్యాలి" అని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్లీనరీలో ఇటీవల ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించగా, "ఈ హామీలను 2014లోనే టీడీపీ అమలు చేసింది. ఇదే మ్యానిఫెస్టోను వైసీపీ కాపీచేసి అంకెలు మార్చేసి ‘నవరత్నాలు’ అంటే ఎవ్వరూ నమ్మరు. మేము చేసిన వాటినే వాళ్లు కాపీ కొడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా త్వరలోనే ‘అన్న’ క్యాంటీన్లు కూడా పూర్తి చేస్తాం. నిరుద్యోగ భృతి కూడా ఈ ఏడాదిలోనే అయిపోతుంది. గతంలో మేము ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం, అందులో ఎటువంటి సందేహమూ లేదు" అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ప్రముఖ హీరోలు పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ గురించి ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రస్తావిస్తూ, జూనియర్ ఎన్టీఆర్ తో తమకు ఎలాంటి విభేదాలు లేవని, పార్టీ కోసం పని చేసేందుకు ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని చెప్పారు. అంతేకాకుండా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. కాగా తమ ఉనికిని చాటుకోవడం కోసమే బీజేపీతో కలుస్తామంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పుకొచ్చారు.