తెలంగాణలో మరోసారి పంచాయతీ ఎన్నికలు!

SMTV Desk 2019-02-13 10:20:47  Telangana Election Commission, Panchayat Elections

హైదరాబాద్, ఫిబ్రవరి 13: తెలంగాణా రాష్ట్రంలో పంచాయతి ఎన్నికలు జరగనున్నాయి. పలు కారణాల వల్ల నిలిచిపోయిన కొన్ని పంచాయతీలలో ఈనెల 28వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అదేవిధంగా ఆయా పంచాయతీల్లో వాయిదా పడిన ఉపసర్పంచ్‌ల ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తి చేయాలని నిర్ణయించింది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి ఈ ఏడాది జనవరి 21, 25, 30 తేదిల్లో మూడు విడతలుగా పంచాయతి ఎన్నికలు నిర్వహంచిన విషయం తెలిసిందే. ఈ సమయంలో రాష్ట్రంలోని ఏడు పంచాయతీల్లో పూర్తిగా ఎన్నికలు నిర్వహించలేదు. అలాగే, ఆరు పంచాయతీల్లో సర్పంచ్‌ల పదవికి, వివిధ పంచాయతీల్లో 246 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగలేదు. 560 పంచాయతీల్లో ఉపసర్పంచ్‌ల ఎన్నిక పెండింగ్‌లో పడింది.
అందుకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈనెల 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 28వ తేదీన ఎన్నికలు నిర్వహించి అదేరోజున ఫలితాలు ప్రకటిస్తారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ఉపసర్పంచ్‌ పదవుల ఎన్నిక ఈనెల 18వ తేదీన పూర్తిచేయాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.