ఓ మూలన కూర్చున్న సీబీఐ డైరెక్టర్!

SMTV Desk 2019-02-13 07:03:05  Nageshwar Rao, AK Sharma, Ranjan Gogoi, LN Rao, Sanjiv Kannah, Supreme Court

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: సీబీఐ అదనపు అధికారి నాగేశ్వరరావు పై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అనుమతి లేకుండా ఓ అధికారిని బదిలిచేసినందుకు ఇలాంటి విచిత్రమైన శిక్షను వేసింది. కోర్టు సమయం ముగిసే వరకు కోర్టులోనే ఒక మూలన కూర్చోవాలంటూ ఆదేశించింది. అంతేకాక సాయంత్రం కోర్టు సమయం ముగియక ముందే మరోసారి వెళ్లేందుకు అనుమతి అడగ్గా, రేపటి వరకూ కోర్టులోనే ఉంటారా? అంటూ ఆగ్రహించింది. బిహార్‌లోని వసతిగృహాల్లో బాలికలపై లైంగిక దాడికి సంబంధించిన ఘటనలపై విచారణ జరుపుతున్న సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ ఏకే శర్మను అప్పటి సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న ఎం.నాగేశ్వరరావు బదిలీ చేశారు. అయితే ఆయన సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితులైన సమయంలోనే ఎటువంటి బదిలీలు చేయడానికి వీల్లేదని కోర్టు అప్పట్లో పేర్కొంది.

కానీ, నాగేశ్వరరావు కోర్ట్ మాటను సైతం లెక్కచెయ్యకుండా ఏకే శర్మను బదిలీ చేశారు. మంగళవారం దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు తమ ఉత్తర్వులను ధిక్కరించారని, ఇందుకు గాను ఆయనకు రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్లు చెప్పింది. నాగేశ్వరరావుతోపాటు సీబీఐ డైరెక్టర్‌ ప్రాసిక్యూషన్‌ బాసూరాం కూడా దోషేనని పేర్కొంటూ ఆయనకూ జరిమానా విధించింది. అలాగే కోర్టు సమయం పూర్తయ్యే వరకు కోర్టు ప్రాంగణంలోనే ఓ మూలన కూర్చోవాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ ఎల్‌ఎన్‌ రావు, సంజీవ్‌ కన్నాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.