హోదా కోసం అర్జునరావు ఆత్మహత్య : రూ.20 లక్షలు ప్రకటించిన చంద్రబాబు

SMTV Desk 2019-02-12 22:37:00  arjunarao, chandrababu naidu, tdp, apcm, delhi, dharmaporata deeksha, arjunarao suicide

ఢిల్లీ, ఫిబ్రవరి 12: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీలో చేపట్టిన ధర్మపోరాట దీక్షకు హాజరైన అర్జునరావు అనే వ్యక్తి తన ఆత్మహత్యతోనైనా కేంద్రప్రభుత్వంలోను, ప్రధాని మోదీలోను కదలిక వస్తుందని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్య చేసుకున్న అర్జునరావు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. ఈ నేపథ్యంలో ఈరోజు అర్జునరావు కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. ఢిల్లీలోని లేడీ హార్డింగ్ ఆస్పత్రిలో అర్జునరావు మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

కాగా అర్జునరావు మృతిపట్ల విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు ఆయన కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించి, భవిష్యత్తులో అన్నివిధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. గవ్వల అర్జునావు ఎవరికీ చెప్పకుండా ఢిల్లీకి వచ్చారని, ధర్నా చేస్తున్న సమయంలో ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదనకు లోనయ్యారు. ఏపీకి అన్యాయం జరిగిందని, ఇక రాష్ట్రానికి హోదా రాదని మనస్తాపం చెందిన తాను ఆత్మహత్య చేసుకుంటే అన్న కేంద్రం ప్రభుత్వంలో, నరేంద్ర మోదీలో కదలిక వస్తుందనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ పట్ల బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తోందని, ఇకనైనా కళ్ళుతెరవాలని సీఎం సూచించారు.