టీడీపీ ఎమ్మెల్యే సహాయం కోసం వెళ్లి అదృశ్యమైన అక్కచెల్లెళ్ళు..

SMTV Desk 2019-02-12 19:53:09  chintamaneni prabhakar, tdp, tdp mla, bonda uma maheswararao, disappeared, two young girls disappeared since one week in krishna district

దెందులూరు, ఫిబ్రవరి 12: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహాయార్ధం వెళ్ళిన అక్కా చెల్లెళ్ళు అదృశ్యమైన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గత వారం రోజులుగా వీరిద్దరి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కోట జ్యోతి కొన్ని మాసాలుగా విజయవాడలో తన ఇద్దరి పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. భర్త రాముతో వివాదాల కారణంగా పదేళ్లుగా ఆమె అతడికి దూరంగా ఉంటుంది. కాగా జ్యోతి కూలీ పనులు చేస్తూ పిల్లలను చదవిస్తోంది. అయితే ఇటీవల ఆమె కిడ్నీలు పాడై జ్యోతి అనారోగ్యానికి గురైంది. తల్లిని కాపాడుకొనేందుకు పిల్లలిద్దరూ కూడ కూలీ పనులు చేస్తున్నారు. అయితే జ్యోతిది పశ్చిమగోదావరి జిల్లాలోని నడిపల్లి గ్రామం. దాంతో తమకు సహాయం చేయాలని కోరేందుకు పిల్లలిద్దరూ స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కలవాలని ఈ నెల 4వ తేదీన ఆయన దగ్గరకు వెళ్లారు. కానీ, ఇంకా తీరిగి రాలేదు.

ఈ నేపథ్యంలో వారి తల్లి జ్యోతి ఈ నెల 10వ తేదీన మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా గత సంవత్సరం వీరు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో ఉండేవారు. తమ పరిస్థితిని చెప్పుకొనేందుకు టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావును కలిశారు. అప్పుడు ఆమె చిన్న కూతురుపై బొండా ఉమా అనుచరులు అత్యాచారానికి ప్రయత్నించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసుతో సంబంధం ఉన్న నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు. వారు కక్ష సాధింపుకు పాల్పడ్డారని జ్యోతి అనుమానం వ్యక్తం చేయగా, పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు.