టీవీకి అమెజాన్ దెబ్బ... భవిష్యత్తులో సీన్ రివర్స్ అవ్వచ్చు

SMTV Desk 2019-02-12 12:14:51  Amazon Prime, movies, TV, TRP Ratings

హైదరాబాద్, ఫిబ్రవరి 12: గతంలో కొత్త సినిమాలు చూడాలంటే ధియేటర్ కి వెళ్లి చూడాల్సిందే. ఒకవేళ ధియేటర్ లో చూడలేని వారు సినిమా ఎప్పుడెప్పుడు టీవీలో వస్తుందా అని ఎదురు చూసేవారు. అందుచేత ఏ సినిమాకి అయినా థియేట్రికల్‌ రైట్స్‌ తర్వాత అత్యంత భారీ మొత్తం వసూలయ్యేది శాటిలైట్‌ రైట్స్‌కి మాత్రమే. సినిమా ధియేటర్ లోకి వచ్చిన మొదట్లో ప్రేక్షకులు సినిమా చూడడానికి ఎంత ఉత్సాహం చూపిస్తారో, సినిమా మొదటిసారి టీవీ లో వస్తుందంటే కూడా ఆ సినిమాని చూడడానికి ప్రేక్షకులు అంతే ఉత్సాహం చూపిస్తారు. దాంతో భారీ సినిమాల ప్రీమియర్లకి టీఆర్పీ రేటింగ్స్ బాగా పెరుగుతాయి.

అయితే ఈ మధ్య కాలంలో ఇలా జరగడం లేదు. ఇటీవల విడుదలైన హిట్ చిత్రాలకి కూడా అనుకున్న స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్ లభించడం లేదు. దీనికి కారణం పెద్ద సినిమాలు విడుదలైన కొన్ని రోజులకే అమెజాన్‌ ప్రైమ్‌లో 4కె రిజల్యూషన్‌తో వచ్చేస్తున్నాయి. దీంతో ఈ ఆన్ లైన్ ప్రింట్లతో కొందర్ పైరసీ ని కూడా తయారు చేస్తున్నారు. ఈ విధంగా మనకి నచ్చిన సినిమాను ఎప్పుడంటే అప్పుడు మొబైల్ ఫోన్ లలో చూసుకునే సదుపాయం అమెజాన్ ప్రైమ్ కల్పించడంతో చాలా చిత్రాలకి శాటిలైట్‌ ప్రీమియర్లకి తగిన ఆదరణ లభించడం లేదు. అమెజాన్ ప్రైమ్ వల్ల శాటిలైట్‌ బిజినెస్‌ దెబ్బ తింటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో సినిమా ఆన్ లైన్ స్ట్రీమింగ్ ధర శాటిలైట్‌ రైట్స్‌ ధరకంటే ఎక్కువగా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.