ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంగిస్తే కఠిన చర్యలు: కిరణ్ బేడీ

SMTV Desk 2019-02-12 10:55:41  Kiran Bedi, IPS, Traffic Rules

పుదుచ్చేరి, ఫిబ్రవరి 12: మొదటి ఐపీఎస్ అధికారిణిగా తన కెరీర్ ను ప్రారంభించారు కిరణ్ బేడి. ప్రస్తుతం పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ గా పని చేస్తున్నారు. అయితే మరోసారి తనలోని పోలీసును బయటకు తీశారు కిరణ్. పుదుచ్చేరిలో హెల్మెట్, సీట్ బెల్ట లను తప్పనిసరి చేయగా, వచ్చిపోయే వాహనదారులను గడగడలాడిస్తూ తన ఐపీఎస్ అవతారం మళ్ళి వెలికి తీశారు. ప్రజల్లో ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహనా కల్పించేందుకు పలు మార్గాల్లో స్వయంగా తనిఖీలు చేశారు.

హెల్మెట్ లేకుండా వెళుతున్నవారిని ఆపి కౌన్సిల్లింగ్ ఇచ్చారు. అలాగే, ఓ బైక్ పై ఇద్దరు మహిళలతో వస్తున్న యువకుడిని ఆపి, గట్టిగా మందలించి, ఓ మహిళను దింపేసి, బస్సులో వెళ్లాలని సలహా ఇచ్చారు. పిల్లలతో వెళుతూ హెల్మెట్ పెట్టుకోని వాళ్లకు మరింత గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కార్లలో వస్తూ సీట్ బెల్ట్ పెట్టుకోని వారిని ఆపి మరి హెచ్చరించారు. ఓవర్ లోడింగ్ తో వెళుతున్న రవాణా వాహనాలనూ ఆమె వదల్లేదు. స్వయంగా లెఫ్టినెంట్ గవర్నర్ వీధుల్లోకి రావడంతో పోలీసు అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వచ్చింది.