శబరిమలలో మళ్ళి ఏం జరుగుతుందో?

SMTV Desk 2019-02-12 10:26:17  Kerala, Shabarimala, Section 144 in Shabarimala

తిరువనంతపురం, ఫిబ్రవరి 12: కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయాన్ని ఈరోజు తెరవనున్నారు. ఆలయం వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. మలయాళ నెల కుంభం సందర్బంగా ఈరోజు ఆలయ తలుపులు తెరవనున్నారు. నేటి సాయంత్రం నుండి ముఖ్య పూజారి వాసుదేవన్‌ నంబూద్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ప్రారంభంకానున్నాయి. కాగా, శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు కేరళ ప్రభుత్వం పట్టుదలతో ఉండటం, సంప్రదాయ విరుద్ధంగా ఆలయంలోకి వచ్చే రుతుస్రావం వయస్సు మహిళలను అడ్డుకునేందుకు హిందూ సంస్థలు ప్రయత్నించడంతో మండల పూజల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి ఆలయంలోకి భక్తులను దర్శనానికి అనుమతించనుండటంతో పోలీసుల ఆంక్షలు, హిందూ సంస్థల నిరసనల మధ్య ఎలాంటి పరిణామాలకు దారితీయనుందోనని ఉత్కంఠ నెలకొంది. అలాగే, ఈమధ్య కాలంలో కొందరు మహిళలు ఆయంలోకి గుట్టుచప్పుడు కాకుండా ప్రవేశించిన విషయం వెలుగు చూడడంతో ఈసారి హిందూ సంస్థలు మరింత అప్రమత్తమయ్యాయి. దీంతో పోలీసులు ఆలయం పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించారు. నలుగురికి మించి గుమిగూడరాదని ఆదేశాలు జారీ చేశారు.