ముచ్చటగా మూడోరోజు సీబీఐ ఎదుట రాజీవ్‌ కుమార్‌, కునాల్‌ ఘోష్‌

SMTV Desk 2019-02-12 06:54:38  Rajiv Kumar, Kunal Ghosh, CBI, Third Day Investigation, Supreme Court, Ranjan Gogoi, Sanjiv Khannala

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న శారద చిట్ ఫండ్ కుంబకోణం కేసులో కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ కునాల్‌ ఘోష్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే రాజీవ్ కుమార్, కునాల్ ఘోష్ వరుసగా మూడో రోజు విచారణ కొరకు సీబీఐ ఎదుట హాజరయ్యారు.

సోమవారం ఉదయం పది గంటలకు ఘోష్ సీబీఐ కార్యాలయానికి హాజరవగా, గంట తర్వాత రాజీవ్‌ కుమార్‌ వచ్చారు. వీరిద్దరినీ ఆదివారం కూడా వేర్వేరుగా పలు కోణాల్లో ఎనిమిది గంటలపాటు విచారించినట్టు సీబీఐ ఉన్నతాదికారి ఒకరు మీడియాకు తెలిపారు. చిట్‌ఫండ్‌ కుంభకోణంకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలను ద్వంసం చేశారన్న ఆరోపణలపై ముగ్గురు సీబీఐ అధికారులు రాజీవ్‌ కుమార్‌ను శనివారం సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

శారదా కుంభకోణం కేసు విచారణను ప్రత్యక్షం గా పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. శారద చిట్‌ఫండ్‌ కుంభకోణంపై సీబీఐ విచారణను ప్రత్యక్షంగా పర్యవేక్షించేలా తాము ఆదేశించలేమ ని జస్టిస్‌ రంజన్‌ గొగొయ్, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాల ధర్మాసనం తెలిపింది.