లోక్ సభ ఎన్నికల్లో ఆ తప్పులు జరగవు : భట్టి విక్రమార్క

SMTV Desk 2019-02-11 20:09:34  clp leader batti vikramarka talks about parliament elections, batti vikramarka, clp congress, telangana politics, parliament elections

హైదరాబాద్, ఫిబ్రవరి 11: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమికి కారణం చివరివరకు అభ్యర్ధుల ఎంపిక, పొత్తుల విషయంలో స్పష్టత లేకపోవడమే అని కొందరు నాయకులు విమర్శించారు. కాగా లోక్ సభ ఎన్నికల్లో ఆ తప్పులు జరగకుండా చూడాలని వారు అదిష్టానికి సూచించారు. అయితే ఈ విషయంపై దృష్టిపెట్టిన కాంగ్రెస్ పెద్దలు తెలంగాణలో లోక్‌సభకు పోటీచేసే తమ పార్టీ అభ్యర్ధులను ఈ నెలలోనే ప్రకటించనున్నట్లు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.

ఈరోజు హైదరాబాద్ గాంధీభవన్ లో భట్టి విక్రమార్క విలేఖరులతో మాట్లాడుతూ.. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేయాలని భావిస్తున్న అభ్యర్థుల నుండి ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. ఈ దరఖాస్తులను అదిష్టానం నియమించే కమిటీ పరిశీలించనుందన్నారు. ఈ నెలలోనే ఈ ప్రక్రియ ముగిసి నెలాఖరులోపు అభ్యర్థుల ప్రకటన వెలువడుతుందని భట్టి వివరించారు. లోక్‌సభ ఎన్నికల పొత్తులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, తుది నిర్ణయం మాత్రం అదిష్టానందేనని భట్టి స్పష్టం చేసారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులను లోక్ సభ ఎన్నికల్లో జరగకుండా చూసుకుంటామని భట్టి విక్రమార్క తెలిపారు.