అధికారంలోకి వచ్చే వరకు నిద్రపోను : రాహుల్

SMTV Desk 2019-02-11 17:20:09  Rahul Gandhi, Priyanka Gandhi, lucknow, Roadshows, congress, aicc

లక్నో, ఫిబ్రవరి 11: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ యూపీలో తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కాగా ప్రభుత్వం ఏర్పడే వరకూ విశ్రమించమని తెలిపారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇక నుంచి యూపీలోనే ఉంటారని స్పష్టం చేసిన రాహుల్‌, రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. రానున్న లోక్‌సభ ఎన్నికలలో కీలకమైన మన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని కార్యకర్తలకు పిలుపునించిన రాహుల్ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటే మన లక్ష్యమని స్పష్టం చేశారు. కాగా యూపీలో పార్టీని బలోపేతం చేయటం కోసం ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింధియాలను ప్రధాన కార్యదర్శులుగా నియమించానని రాహుల్‌ చెప్పారు.

ప్రియాంక గాంధీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయిన తరువాత రాహుల్‌తో కలిసి తొలిసారిగా లక్నోలో భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు. లక్నో విమానాశ్రయం నుంచి నెహ్రూ భవన్‌ వరకూ సాగిన ఈ రోడ్‌ షోలో ప్రియాంక, రాహుల్‌ అభిమానులకూ, కార్యకర్తలకూ అభివాదం చేస్తూ ముందుకుసాగారు. ప్రియాంక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా చేపట్టిన తొలి ర్యాలీకి విస్తృత స్పందన లభించింది.