గాయాలపై కారం చల్లి మోదీ రాక్షసానందం: చంద్రబాబు నాయుడు

SMTV Desk 2019-02-09 12:18:33  Chandrababu Naidu, Narendra Modi, PM AP Tour, Jaganmohan Reddy, YCP, BJP, TDP, Rafale Deal

అమరావతి, ఫిబ్రవరి 09: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీల గాయాలపై కారం చల్లి మోదీ రాక్షసానందం పొందాలని చూస్తున్నారన్నారు. తను చేసిన దుర్మార్గాన్ని, అన్యాయాన్ని చూసేందుకు రేపు ఏపీకి వస్తున్నారని మండిపడ్డారు. మోదీ ముందు, వెనుక ఆలోచించకుండా మాట్లాడతారని, రేపు గుంటూరులో కూడా అదే పద్దతిని ప్రదర్శించబోతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఈరోజు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో అమరావతిలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

చంద్రబాబు ప్రధాని పర్యటన ఏపీని అపవిత్రం చేస్తుందన్నారు. పసుపు, నలుపు చొక్కాలు, బెలూన్లతో ఆయనకు నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. మహాత్ముడి స్ఫూర్తితో రేపు, ఎల్లుండి చీకటి రోజులుగా నిరసనలు తెలపాలన్నారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మోదీ వైఖరి పట్ల ఒక్క మాట కూడా మాట్లాడారని, వైసీపీ-బీజేపీ ఒకటి అయ్యాయని చెప్పడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందంలో ప్రధాని జోక్యం చేసుకోవడం దేశానికి అప్రతిష్టగా మారిందని విమర్శించారు. రఫేల్ బురదలో మోదీ కురుకుపోయారని వ్యాఖ్యానించారు.