ఒక్కొక్కరి ఖాతాల్లో రూ. 25 వేల నుంచి రూ. 15 లక్షలు, నమ్మిన ప్రజలు

SMTV Desk 2019-02-09 10:03:06  Bihar, Account, Money, Narendra Modi, Post Office

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 09: బీహార్‌లో ఓ విచిత్ర పుకారు సంచలనం రేపింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక్కొక్కరి ఖాతాల్లో రూ. 25 వేల నుంచి రూ. 15 లక్షల వరకు జమ చేస్తున్నారనే ప్రచారాన వెలువడింది. దీంతో పోస్టాఫీసుల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ ఘటన బీహార్‌లోని మోతీహారీ అనే గ్రామంలో చోటు చేసుకుంది.

దీంతో గ్రామస్థులు హుటాహుటిన పోస్టాఫీసుకు వెళ్లారు. ఖాతాలు తెరిచేందుకు పోటీలు పడ్డారు. పోస్టాఫీసు వద్ద మహిళలు, పురుషులు క్యూల్లో గంటల కొద్దీ నిలబడ్డారు. ఈ వార్త నిజం కాదని, అదంతా పుకారని చెప్పినప్పటికీ ఎవరూ వినిపించుకోలేదు. ఆకలి, దప్పికలు మాని మరీ ఖాతాలు తెరిచేందుకు ఆసక్తి చూపారు. ఆ గ్రామస్థులందరూ పోస్టాఫీసు వద్ద క్యూ కట్టడంతో జాతరను తలపించింది.