కేసీఆర్ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ప్రజలు ఊరుకోరు : రేవంత్ రెడ్డి

SMTV Desk 2017-08-02 17:27:13  revanth reddy demands kcr

హైదరాబాద్, ఆగష్టు 2 : సీఎం కేసీఆర్ పై టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో తన ఇష్టానుసారం ప్రవర్తిస్తే ప్రజలు ఊరుకోరని మండిపడ్డారు. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ ఉద్యాన వర్శిటీ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు తన మద్దతు ప్రకటిస్తూ అక్కడి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... అర్ధరాత్రి సమయంలో విద్యార్థుల హాస్టళ్లలోకి ప్రవేశించి వారిపై దౌర్జన్యం చేయడం, అక్రమ అరెస్టులు చేయడం ప్రభుత్వానికి తగదని వ్యాఖ్యానించారు. విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యానవర్శిటీ విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ రాష్ట్రంలోని అన్ని స్కూల్స్, కాలేజ్ ల విద్యార్థులు నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. దీంతో అక్కడ ఆందోళన ఉదృతం అవుతుందని పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.