వైసీపీని సభకు రావాలని రిక్వెస్ట్ చేశా : కోడెల

SMTV Desk 2019-02-08 20:35:22  Chandrababu, kodela siva prasad rao, ap assembly, ap, tdp, ycp, ys jagan

అమరావతి, ఫిబ్రవరి 8: ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ కోడెల శివ ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీ నాలుగు సమావేశాల నుంచి అసెంబ్లీకి హాజరుకాకపోవడం బాధ కలిగించిందన్నారు. తాను రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని అయినప్పటికీ శాసన సభ నిండుగా ఉండాలని కోరుకుంటానని అన్నారు. తాను ఎన్నిసార్లు వైసీపీని శాసనసభ సమావేశాలకు రావాలని రిక్వస్ట్ చేసినా వారు రాకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో అనేక గొప్ప విషయాలు జరిగాయన్నారు.

ప్రతిపక్ష పార్టీలు తనను పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఎందుకు వెయ్యడం లేదో చెప్పాలని డిమాండ్ చేసిన అనేక ఆరోపణలను గుర్తు చేశారు. అయితే సభ నియమాల ప్రకారం శాసన సభకు వరుసగా మూడు సమావేశాలకు హాజరుకాకపోతే వారిపై అనర్హత వేటు వెయ్యోచ్చు అని చెప్పుకొచ్చారు. కాగా కొంతమంది టీడీపీ సభ్యులు తనకు చెప్పి వెళ్లేవారని స్పష్టం చేశారు. అయితే కొంతమంది సభ్యులు వారు అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించేవారని, ఇతర శాసన సభ కమిటీ సమావేశాలకు హాజరై అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడాన్నితప్పుబట్టేవారని చెప్పుకొచ్చారు. ఇక తన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించానని భావిస్తున్నట్లు కోడెల శివప్రసాదరావు తెలిపారు. సభను ఇంత హుందాగా నడిపించేందుకు సహకరించిన ప్రతీ సభ్యుడికి కృతజ్ఞతలు చెప్పారు.