జియో ఉచితాలకు స్వస్తి పలికే సమయమొచ్చింది!

SMTV Desk 2017-08-02 17:21:14  Search and ratings company S & P, Geo, End for free, indian telecom

న్యూఢిల్లీ, ఆగస్టు 2 : గత ఏడాది నుంచి భారత్ లో టెలికం రంగాన్ని ఆఫర్ల వెల్లువతో కుదిపేస్తున్న జియో ఇకపై ఉచిత ఆఫర్లకు స్వస్తి పలకనుందని సెర్చ్ అండ్ రేటింగ్స్ సంస్థ ఎస్ అండ్ పీ ఒక నివేదిక వెల్లడించింది. జియో తానందిస్తున్న ఉచితాలకు ముగింపు పలికే సమయం దగ్గరలో ఉన్నదని, మరో ఏడాదిన్నరలో పోటీని విరమించి, ధరలను హేతుబద్ధం చేస్తుందని అంచనా వేసింది. చెప్పకోతగిన కస్టమర్లు సంఖ్య జియో గొడుగు కిందకు చేరిన నేపథ్యంలో, మార్జిన్లు పెంచుకోవడం, ఆదాయంపై ఆ సంస్థ దృష్టిని సారించనుందని ఎస్ అండ్ పీ క్రెడిట్ అనలిస్టు అశుతోశ్ శర్మ వెల్లడించారు. భారీ డిస్కౌంట్ విధానం జీవితకాలం కొనసాగే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డ ఆయన, ఇప్పటికే 10 శాతం సెల్ ఫోన్ వినియోగదారులకు జియో చేరువైందని గుర్తు చేశారు. ఇందుకోసం ఆ సంస్థ ఏడాది కన్నా తక్కువ సమయాన్నే తీసుకుందని, భారీ డిస్కౌంట్లు, ఉచిత ఆఫర్లే ఇందుకు గల కారణమని ఆయనన్నారు. జియో తెరతీసిన ఈ టెలికం టారిఫ్ వార్ కారణంగా ఇతర కంపెనీలు లాభాలను కొనసాగించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని అశుతోశ్ వెల్లడించారు.