లీ నింగ్ తో పివి సింధు భారీ ఒప్పందం...

SMTV Desk 2019-02-08 19:21:11  PV SIndhu, Lee Ningh, China, Badminton

హైదరాబాద్, ఫిబ్రవరి 08: తెలుగు తేజం, ఒలింపిక్స్, వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లలో రజత పతక విజేత పివి సింధు తాజాగా ఓ అరుదైన ఒప్పందం కుదుర్చుకుంది. చైనా దేశానికి చెందిన క్రీడా సామాగ్రి ఉత్పత్తి సంస్ధ లీ నింగ్ తో నాలుగేళ్లకు దాదాపు రూ.50 కోట్ల ఒప్పందం కుదుర్చుకొంది. కాగా ఈ రికార్డ్ కాంట్రాక్ట్ కి ముందు చైనాకి చెందిన లీ నింగ్ కంపెనీ గత నెలలో మరో భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ తో నాలుగేళ్లకు రూ.35 కోట్ల ఒప్పందం కుదుర్చుకొంది.

భారత్ లో లీ నింగ్ భాగస్వామి సన్ లైట్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మహేంద్ర కపూర్ ఈ ఒప్పందం గురించి మాట్లాడుతూ సింధుతో ఒప్పందం ప్రపంచ బ్యాడ్మింటన్ లోనే అతిపెద్ద ఒప్పందాల్లో ఒకటి. సుమారు రూ.50 కోట్ల కాంట్రాక్ట్ లో స్పాన్సర్షిప్, సామాగ్రి కూడా ఉన్నాయని చెప్పారు. ఇది టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో ప్యూమా కుదుర్చుకున్న ఒప్పందం వంటిది. సింధుకి రూ.40 కోట్లు స్పాన్సర్షిప్ గా లభిస్తాయి. మిగతా మొత్తం సామాగ్రి రూపంలో అందజేయడం జరుగుతుందని తెలిపారు.

2017లో ప్యూమా కోహ్లీతో ఎనిమిదేళ్లకు రూ.100 కోట్ల ఒప్పందం కుదుర్చుకొంది. అంటే ఏటా దాదాపుగా రూ.12.5 కోట్లు. రియో ఒలింపిక్స్ లో రజత పతకం గెలిచిన తర్వాత సింధు పాపులారిటీ అమాంతంగా పెరిగిపోయింది. గత ఏడాది ఫోర్బ్స్ జాబితాలో ఆమె ప్రపంచంలోనే ఆర్జనలో ఏడో స్థానం సాధించింది. లీ నింగ్ ఇంతకు ముందు 2014-15లో సింధులో ఒప్పందం కుదుర్చుకొంది. అప్పుడు రూ.1.25 కోట్లకి కాంట్రాక్ట్ కుదిరింది. సింధు ఆ తర్వాత 2016లో యోనెక్స్ మూడేళ్ల కాంట్రాక్ట్ పై సంతకం చేసింది.

పురుషుల డబుల్స్ జోడీ మను అత్రి, బీ సుమీత్ రెడ్డిలతో లీ నింగ్ రెండేళ్లకు చెరో రూ.4 కోట్ల ఒప్పందం కుదుర్చుకొంది. కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్ తో కంపెనీ రూ.8 కోట్లకు రెండేళ్ల కాంట్రాక్ట్ కుదుర్చుకొంది. చైనాకి చెందిన లీ నింగ్ కంపెనీ భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)తో కూడా రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకొంది. ఈ ఒప్పందం ప్రకారం కంపెనీ 2020 టోక్యో ఒలింపిక్స్ కి భారతీయ క్రీడాకారులు, అధికారులకు పోటీ, శిక్షణకు అవసరమైన దుస్తులు, బూట్లు అందజేస్తుంది.