గృహ నిర్మాణాల వడ్డీ రెట్ల తగ్గింపుపై కేంద్ర ప్రముఖుల అభిప్రాయాలు...

SMTV Desk 2019-02-08 18:27:26  Reserve bank of india, Home construction loans, Repo rate, Central Finance MInister, Piyush Goayl

న్యూఢిల్లీ. ఫిబ్రవరి 08: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటుపై గురువారం పలు సంచలన నిర్ణయాలు ప్రకటిస్తూ రెపోరేటును 25 పాయింట్లు తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మరో వైపు వడ్డీ రేట్లను కూడ తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకొంది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి పియూష్ గోయల్ హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని రంగాలకూ ఈ నిర్ణయం లాభించి ఉద్యోగావకాశాలు పెరుగగలవన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ‘6.5 శాతంగా ఉన్న రెపో రేటును 6.25 శాతానికి ఆర్బీఐ తగ్గించడాన్ని స్వాగతిస్తున్నాం. దీనివల్ల బ్యాం కుల రుణాలపై వడ్డీరేట్లు తగ్గేందుకు ఆస్కారమున్నది. ఇది చిన్న వ్యాపారులు, గృహ కొనుగోలుదారులకు లాభం’ అని పీయూష్ గోయల్ ట్వీట చేశారు.

కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ స్పందిస్తూ ‘ఆర్బీఐ నిర్ణయం భేష్. ప్రస్తుత పరిస్థితుల్లో సరైన విధానాన్ని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లపై ఉన్న ఆంక్షల్ని తొలగించడాన్నీ స్వాగతిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఎస్‌బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ స్పందిస్తూ ‘మున్ముందు వడ్డీరేట్లు మరింత తగ్గేందుకు అవకాశాలున్నాయి. ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్ణీత స్థాయి కంటే దిగువనే ఉన్నందున రాబోయే సమీక్షల్లో వడ్డీరేట్ల కోతకు వీలున్నది’ అని అన్నారు.

సీఐఐ అధ్యక్షుడు రాకేశ్ భారతీ మిట్టల్ మాట్లాడుతూ ‘రెపో రేటు తగ్గింపు నిస్తేజంగా ఉన్న వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో నూతనోత్సాహాన్ని నింపింది. బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీరేట్లను తగ్గించి ప్రయోజనాన్ని అందించాలి’ అని వ్యాఖ్యానించారు. ఫిక్కీ అధ్యక్షుడు సందీప్ సోమని మాట్లాడుతూ రాబోయే ద్రవ్యసమీక్షల్లో కీలక వడ్డీరేట్లు మరింతగా తగ్గాలి. బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి, మందగించిన వృద్ధిరేటు పురోగతికి ఆమోదయోగ్యమైన వడ్డీరేట్లు అవసరం’ అని చెప్పారు. అసోచాం అధ్యక్షుడు బాలకృష్ణన్ గోయెంకా ఈ సందర్భంగా స్పందిస్తూ ‘వడ్డీరేట్ల తగ్గింపు ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ ప్రయోజనాన్ని పరిశ్రమకు బ్యాంకులు అందించాలి. మధ్య, భారీతరహా సంస్థల రుణాల విషయంలో ఆర్బీఐ కనికరించాలి’ అని తెలిపారు.

ఈఈపీసీ ఇండియా చైర్మన్ రవీ సెహగల్ మాట్లాడుతూ ‘అంతర్జాతీయంగా ఎగుమతిదారులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించేలా ఆర్బీఐ చొరవ తీసుకుంటే ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించవచ్చు’ అని పేర్కొన్నారు. డీబీఎస్ గ్రూప్ రిసెర్చ్ ప్రతినిధి రాధికా రావు స్పందిస్తూ ‘ఈ సమీక్షలో రెపో రేటు తగ్గింపును ఊహించలేకపోయాం. ఈ క్రమంలో ఏప్రిల్‌లో జరిగే ద్రవ్యసమీక్షలో మరో పావు శాతం తగ్గవచ్చని భావిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు.

క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు జక్సే షా మాట్లాడుతూ ‘ఆర్బీఐ నిర్ణయంతో హౌజింగ్ డిమాండ్ పెరుగొచ్చు. అయితే ఎన్‌బీఎఫ్‌సీ, హౌజింగ్ ఫైనాన్స్ సంస్థల్లో ద్రవ్యలభ్యత పెరుగుదలకు ఆర్బీఐ మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉన్నది’ అని అన్నారు. నరెడ్కో అధ్యక్షుడు నిరంజన్ హీరానందని స్పందిస్తూ ‘గృహ నిర్మాణ రంగంలో అమ్మకాలు తిరిగి పుంజుకుంటాయని ఆశిస్తున్నాం. ద్రవ్యకొరతను ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ పరిశ్రమకు ఆర్బీఐ కొత్త ఊపిరిలూదింది’ అని తెలిపారు. క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు కొనుగోలుదారులకు బదిలీ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అప్పుడే ఇండ్ల కొనుగోళ్లు పెరుగుతాయి’ అని చెప్పారు.