టీ20 సిరీస్ ను చేజార్చుకున్న మహిళలు....

SMTV Desk 2019-02-08 11:54:45  India Women VS Newzeland Women, T20, 2ND T20, Westpac stadium, Vellington, Akland, Eden park stadium

ఆక్లాండ్ ఫిబ్రవరి 08: నేడు ఆక్లాండ్ వేదికగా ఈడెన్ పార్క్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో కూడా టీం ఇండియా విఫలం అయ్యి సిరీస్ ను చేజార్చుకుంది. ఈ మ్యాచ్ లో టీం ఇండియాపై కివీస్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన హర్మన్‌ప్రీత్‌ సేన ఆదిలోనే తడబడింది. మూడో ఓవర్‌లోనే ఓపెనర్‌ ప్రియా పునియా ఔటయ్యింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జెమిమా రొడ్రిగస్‌.. ఓపెనర్‌ స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది.

72 పరుగులతో స్కోరు బోర్డును పరుగులు పెట్టింది. అయితే మంధాన ఔట్‌ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన వారెవరూ క్రీజులో నిలదొక్కుకోకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 6 వికెట్లు నష్టపోయి 135 పరుగులు చేసింది.

ఆ తర్వాత ఛేదనకు దిగిన కివీస్‌ జట్టు మొదట్లో కాస్త తడబడింది. ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్‌ సూజీ బేట్స్‌(62) నిలకడగా రాణించి స్కోరును పెంచింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో కివీస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 136 పరుగులు చేసి విజయం సాధించింది.

దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో న్యూజిలాండ్‌ కైవసం చేసుకుంది. కాగా బుదవారం వెస్ట్ పాక్ స్టేడియం వెల్లింగ్టన్ వేదికగాజరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో కివీస్ టీం ఇండియాపై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.