సిర్పూర్ కాగితపు పరిశ్రమ పునఃప్రారంభం

SMTV Desk 2019-02-08 11:28:29  Sirpur Paper Mill, KTR, Jayesh Ranjan, Twitter

హైదరాబాద్, ఫిబ్రవరి 08: కాగజ్‌నగర్ లోని సిర్పూర్ కాగితపు పరిశ్రమను గురువారం రాత్రి 8.20 గంటలకు మళ్ళి ప్రారంభించారు. 2014లో మూతపడిన ఈ పరిశ్రమ నిన్న తిరిగి ప్రారంబించడం పై తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 1938 లో నిజాం కాలం లో ఈ సిర్పూరు పేపర్ మిల్లును స్థాపించారు. బిర్లాగ్రూప్ 1950లో దీన్ని టేకోవర్ చేసింది.

అప్పటినుండి నిరాటంకంగా ఉత్పత్తి కొనసాగింది. అయితే, 2007-08 మధ్య కాలంలో అప్పటి యాజమాన్యం కొత్త యంత్రాల కొనుగోలు పేరుతో మిల్లును ఐడీబీఐకు తాకట్టు పెట్టింది. నష్టాలు పెరిగిపోవడంతో 2014 సెప్టెంబర్ 27న సంస్థని మూసివేశారు. అప్పటికే ఆ సంస్థ పై 3200 మంది కార్మికులు ఆధారపడి బతుకుతున్నారు. 2016 అక్టోబర్ 22న ఈ మిల్లును ఐడీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మిల్లును తెరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మిల్లును టేకోవర్ చేసే కంపెనీలకు రాయితీలు ఇస్తామని 2016 సెప్టెంబర్‌లో ప్రభుత్వం ప్రకటించింది.కేటీఆర్ ట్విట్టర్ లో స్పందిస్తూ, గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో సిర్పూర్ పేపర్ మిల్లు మళ్లీ తెరుచుకోవడంతో పాటు ఉత్పత్తి ప్రారంభమయింది. దీనివల్ల వందలాది మంది కార్మికుల జీవితాల్లో సంతోషం నిండనుంది.

ఇందుకోసం ప్రత్యేక చోరవ చూపిన పరిశ్రమల కార్యదర్శి జయేశ్ రంజన్ గారికీ, ఆయన టీమ్ కు అభినందనలు. తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరణ చేపట్టిన అనేక మూతపడ్డ పరిశ్రమల్లో సిర్పూర్ మిల్లు ఒకటి అని ట్వీట్ చేశారు.