టీఎస్ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు...!

SMTV Desk 2019-02-08 11:10:02  Telangana, Congress party, Rega Kantharao,Deepak Choudary

హైదరాబాద్, ఫిబ్రవరి 08: కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు తలెత్తాయి. తెలంగాణలో 31 జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకానికి ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురువారం ఆమోదం తెలిపారు. ఈ ప్రకటన వెలువడగానే పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు రాజీనామా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ చీఫ్ ను తనకు చెప్పకుండా నియమించారని ప్రశ్నించారు.

అందుకు నిరసనగా పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి, వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జ్ పదవికి రాజీనామా చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తన సొంత ప్రాంతమని, స్థానిక డీసీసీ అధ్యక్షుని నియామకం విషయం తనతో చర్చించలేదని అన్నారు.

మరోవైపు కార్పొరేటర్ దీపక్ చౌదరి తనకు డీసీసీ అధ్యక్ష పదవి కావాలని అభ్యర్థిస్తే రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఖమ్మం సిటీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడంపై అసంతృప్తి వ్యక్తం చేసారు. ఖమ్మం జిల్లాలో బలంగా ఉందనుకున్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడటం ఆ పార్టీ శ్రేణులను కలవరపెడుతున్నాయి.