ప్రతిపక్షాలను సైతం ఆహ్వానిస్తాం : బాబు

SMTV Desk 2019-02-08 09:43:38  Chandrababu Naidu, Shariff, Narendra Modi, Jaganmohan Reddy, Galla Jaidev

అమరావతి, ఫిబ్రవరి 08: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీ నే లక్ష్యంగా విమర్శించారు. విభజన హామీలు అమలు చేయకపోవడం వల్ల తగిలిన గాయంపై ఆయన కారం చల్లుతున్నారని మండిపడ్డారు. విపక్ష పార్టీలను మహా కల్తీ కూటమిగా అభివర్ణించడం దిగజారుడుతనమేనని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ మోసాన్ని టీడీపీ ఏంపి గల్లా జయదేవ్ లోక్ సభలో సూటిగా ఎండగట్టారని వ్యాఖ్యానించారు.

ఈరోజు చంద్రబాబు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మామూలు కార్యకర్త స్థాయి నుంచి షరీఫ్ శాసనమండలి చైర్మన్ స్థాయికి ఎలా ఎదిగారని ప్రశంశించారు. పనిచేసే కార్యకర్తలకు టీడీపీలో గుర్తింపు ఉంటుందని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 80 శాతం ప్రజలు టీడీపీ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారన్నారు.

రాజకీయాల్లో విభేదాలు సహజమనీ, కానీ అందరూ పార్టీకి విశ్వాసంగా ఉండాలని సూచించారు. టీడీపీలో చిట్టచివరి కార్యకర్తకు కూడా న్యాయం చేసే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఈ నెల 11న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ దీక్ష చేస్తానని, అదే రోజున ఢిల్లీలో జరిగే ధర్మపోరాటాన్ని విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ప్రజలు, ప్రజాసంఘాలు రాష్ట్రం వైపు ఉంటే, ప్రతిపక్షాలు మాత్రం రాజకీయాల వైపు ఉన్నాయని విమర్శించారు. ప్రధాని మోదీది మాటల గారడి అయితే ప్రతిపక్ష నేత జగన్ ది మోసాల గారడి అని దుయ్యబట్టారు. ఈ ఆందోళనకు ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించాలనీ, రాకపోతే ప్రజలే నిర్ణయించుకుంటారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.