రైతులకు ఆర్‌బీఐ బహుమతి

SMTV Desk 2019-02-08 08:07:22  Budjet Meeting, Reserve Bank of India, Kisan Samman Nidi

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 08: ఇటీవల జరిగిన కేంద్ర బడ్జెట్ లో ప్రధాని నరేంద్ర మోదీ రైతుల సంక్షేమం కొరకు ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ నిది గురించి తెలిసిందే. ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ. 6000 ఇవ్వనున్నట్టు బడ్జెట్ సమావేశంలో మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో తాజాగా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) కూడా రైతులకు మరో శుభవార్త చెప్పనుంది. ఎటువంటి హామీ అవసరం లేకుండా వ్యవసాయ రుణాల పరిమితిని రూ. లక్ష నుంచి రూ. 1.60లక్షలకు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి హామీ లేకుండా వ్యవసాయ రుణాల పరిమితిని రూ. 1.6లక్షల వరకు పెంచుతున్నామని చిన్న, సన్నకారు రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని ఆర్‌బీఐ పేర్కొంది. ఈ విషయం గురించి అన్ని బ్యాంకులకు త్వరలోనే నోటీసులు జారి చేస్తామని తెలిపింది.