20 ఏళ్లుగా ఎవ్వరూ చేధించని కుంబ్లే రికార్డు...

SMTV Desk 2019-02-07 21:31:55  Kumble, India VS Pakistan Test series 1999, Firoz shah kotla stadium

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 07: భారత క్రికెట్ చరిత్రలో 20 ఏళ్ల క్రితం ఇదే రోజు(ఫిబ్రవరి7వ తేదీ) భారత ఆటగాడు కుంబ్లేకు చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. 1999 జనవరి నెలలో భారత పర్యటనకు వచ్చిన పాకిస్తాన్ టీమ్ రెండు టెస్టుల్లో తలపడింది. ఫిబ్రవరి 4న ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల స్టేడియంలో ప్రారంభమైన ఆ టెస్టులో భారత్‌ గెలిస్తేనే సిరీస్‌ ను కాపాడుకుంటుంది. ఆ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌ లో భారత్ 252 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆపై అనిల్ కుంబ్లే (4 వికెట్లు), హర్భజన్ (3 వికెట్లు) దెబ్బకు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే చాపచుట్టేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 339 పరుగులు చేసిన భారత్.. పాక్ ముందు 420 పరుగుల టార్గెట్ ను ఉంచింది.

రెండో ఇన్నింగ్స్‌ లో పాక్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి పాక్‌ ను పటిష్ట స్థితికి చేర్చారు. ఆ తరుణంలో తొలి వికెట్‌ గా షాహిద్‌ ఆఫ్రిదిని ఔట్‌ చేసిన తన వేటను ప్రారంభించాడు కుంబ్లే. వరుసగా వికెట్లు సాధిస్తూ.. 207 పరుగులకే పాక్‌ ను కుప్పకూల్చాడు. భారత్‌ కు 212 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. దాంతొ ఒ‍క ఇన్నింగ్స్‌ లో పదికి పది వికెట్లు సాధించి ఆ ఘనత నమోదు చేసిన రెండో బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఇప్పటి వరకూ ఈ ఘనతను ఏ ఆటగాడు చేదించలేకపోవడం విశేషం.