పుత్తడిపై షేర్ ఇన్వెస్టర్ల దృష్టి...

SMTV Desk 2019-02-07 19:02:43  Gold Rate, Share investors, Share markets, Indian share markets, International economic growth rate

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 07: అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు తగ్గిపోవడంతో మరోసారి షేర్ ఇన్వెస్టర్ల దృష్టి బంగారం వైపు మళ్ళింది. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి నెలకొంది. ఏడాది ప్రారంభంలో లాభాల బాటలో పయనించిన ఔన్స్ బంగారం ధర 1,321.21 డాలర్ల వద్ద ముగిసింది. వరుసగా పుత్తడి ధరలో నాలుగో నెలలో పెరుగుదల నమోదైంది. ప్రపంచ దేశాల ఆర్థిక అభివృద్ధిరేటు పూర్తిగా తగ్గిపోయింది. ఈక్విటీ మార్కెట్లు గత ఏడాది కాలంగా తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నాయి. దీనికి తోడు వడ్డీరేట్ల పెంపునకు అమెరికా ఫెడరల్‌ రిజర్వు విరామం ఇవ్వడం, డాలర్‌ బలహీనత, అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అస్థిరతలు తదితర అంశాలు పుత్తడి ధరలు పెరుగడానికి దోహదం చేస్తున్నాయి. అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం తగ్గుముఖం పట్టే సూచనలేవీ కనుచూపు మేరలో కనిపించడంలేదు. మరోవైపు అమెరికాలో ఏర్పడిన షట్‌డౌన్‌ డాలర్‌ రేటును ప్రభావితం చేశాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వు దూకుడు తగ్గించడం తప్పనిసరి అని మార్కెట్‌ వర్గాలు ఒక నిర్ణయానికి రావడంతో సెంటిమెంట్‌ బలహీనపడింది. 2018లో అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంక్ ఏడాది పొడవునా వడ్డీరేట్లు పెంచుతూనే వచ్చింది. వరుసగా తొమ్మిది సార్లు వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోవడం వల్ల కూడా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీకి అవరోధం ఏర్పడింది.

2019 సంవత్సరంలో ఇదే ధోరణి అనుసరిస్తే మరింత రిస్క్‌ తప్పదన్న సంకేతాలు కూడా అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పోవెల్‌ వడ్డీరేట్ల పెంపు క్రమానికి విరామం ఇవ్వడానికి కారణం. ఈ స్థూల ఆర్థిక పరిస్థితులన్నీ భవిష్యత్‌లో బంగారం ధరలు మరింతగా పెరుగడానికి సంకేతాలని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అస్థిరతలు పెరిగిపోయిన వాతావరణంలో పెట్టుబడుల్లో సమతూకం తెచ్చి పోర్ట్‌ఫోలియోలో రిస్క్‌ను తగ్గించే సాధనం బంగారం ఒక్కటేనని వారు చెబుతున్నారు. ఈ ఏడాదిని బులియన్‌ ఏడాదిగా పరిగణించవచ్చని ప్రముఖ ఫైనాన్సియల్ కన్సల్టెన్సీ సర్వీస్ సంస్థ కార్వీ కన్సల్టెంట్స్‌ తెలిపింది. కార్వీ సంస్థ కరెన్సీ, కమోడిటీ మార్కెట్లపై నివేదికను వెలువరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర పెట్టుబడి సాధనాల కన్నా బంగారం, వెండి మెరుగైన రాబడులు అందించే ఆస్కారం ఉన్నదని కార్వీ కమోడిటీస్‌, కరెన్సీస్‌ విభాగం సీఈఓ రమేశ్‌ వరఖేడ్కర్‌ తెలిపారు. దేశీయంగా బంగారం ధరల 10 గ్రాముపై 25 రూపాయలు తగ్గినా రూ.34,450గా నమోదయ్యాయి. కిలో వెండి ధర కూడా రూ.320 తగ్గి 41,380గా రికార్డైంది. 99.9% గోల్డ్ పది గ్రాముల ధర రూ.25 తగ్గి రూ.34,450లకు, 99.5 శాతం పసిడి ధర 34,300 వద్ద స్థిరపడింది. సావరిన్ గోల్డ్ ధర ఎనిమిది గ్రాములకు రూ.26,100 పలుకుతోంది.