మిలటరీ స్టేషన్లుగా మారనున్న జనవాసప్రాంతాలు...?

SMTV Desk 2019-02-07 08:41:56  Cantonment board, cancellation, Military, Scundrabad, Telangana

హైదరాబాద్, ఫిబ్రవరి 07: దేశవ్యాప్తంగా కంటోన్మెంట్ బోర్డులను కేంద్రం రద్దు చేయనుంది. మిలటరీ స్టేషన్ లలో అంతర్భాగంగా ఉన్న జన నివాస ప్రాంతాలను తప్పించానున్నారు. ఈ నేపథ్యంలో మిలిటరీ స్టేషన్ లలో కలిసి ఉన్న జనావాస ప్రాంతాలు ప్రత్యేక మిలిటరీ స్టేషన్లుగా మారనున్నాయి. ఈ ప్రక్రియపై అధ్యయనం చేసేందుకు గతేడాది ఆగస్టులో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నారు.

పార్లమెంట్ లో ఈ విషయాన్నీ రక్షణ శాఖ సహాయమంత్రి డాక్టర్‌ సుభాష్‌ బమ్రే స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్లను మిలిటరీ స్టేషన్లుగా మార్చాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కంటోన్మెంట్ల పనితీరుపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ప్రత్యేక నివేదికను సమర్పించనుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 62 కంటోన్మెంట్ల పరిధిలో 1,86,730.39 ఎకరాల భూమి ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రక్రియ అమలులోకి వస్తే ప్రస్తుతం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో కొనసాగుతున్న జన నివాస ప్రాంతాలు జీహెచ్‌ఎంసీలో విలీనమయ్యే అవకాశముంది. అంతేకాకుండా కంటోన్మెంట్లను రద్దు చేస్తే ప్రభుత్వానికి బైసన్‌ పోలో, జింఖానా సహా ప్రతిపాదిత స్కైవేల నిర్మాణానికి అవసర మయ్యే భూబదలాయింపు ప్రక్రియ సులభమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించే భూమిలో అధిక శాతం కంటోన్మెంట్‌ బోర్డుకు సంబంధించినవే అయినందున ప్రభుత్వం ఎలాంటి సర్వీసు చార్జీలు చెల్లించకుండానే బైసన్‌పోలో, జింఖా నా మైదానాలతో పాటు, ప్యాట్నీ-హకీంపేట, ప్యారడైజ్‌-సుచిత్ర మార్గాల్లోని స్కైవేలకు భూములను సేకరించవచ్చు.