కివీస్ తో తొలి టీ20 : టీంఇండియాకు ఎదురుదెబ్బ

SMTV Desk 2019-02-06 19:06:02  India VS Newzeland, T20, Westpac Stadium, Wellington, Rohith sharma

వెల్లింగ్టన్‌, ఫిబ్రవరి 06: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీంఇండియా పరాజయ పాలైంది. న్యూజిలాండ్ గడ్డపై వన్డే సిరీస్‌ని 4-1తో చేజిక్కించుకొని చరిత్ర సృష్టించిన భారత్ జట్టుకి టీ 20 మ్యాచ్ లో ఆదిలోనే గట్టి సవాల్ ఎదురైంది. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19.2 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆతిధ్య న్యూజిలాండ్ జట్టు 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో కివీస్ ఆధిక్యం సాధించింది. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఆక్లాండ్ వేదికగా రెండో టీ20 జరగనుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కివీస్ ఓపెనర్ సీఫర్ట్ కు దక్కింది. కివీస్ నిర్దేశించిన 220 పరుగుల ఛేదనకు బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ రోహిత్‌ శర్మ ఒక్క పరుగుకే పెవిలియన్‌ చేరాడు. అనంతరం దూకుడు మీదున్న ధావన్ (29) బోల్డ్ అయ్యాడు. ఇక స్పిన్నర్లు శాంట్నర్, సోధిల ధాటికి భారత బ్యాట్స్‌మెన్‌ శంకర్ (27), పంత్ (5), కార్తీక్ (5), హార్దిక్ పాండ్యా (4)లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 77 పరుగులకే ఆరు వికెట్లు చేజార్చుకున్న టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ దశలో ధోనీ (39).. కృనాల్ పాండ్యా (20)తో కలిసి జట్టు స్కోరును 100 దాటించాడు. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాల్సి ఉండటంతో.. వేగంగా ఆడే క్రమంలో ఇద్దరూ అవుట్ అయ్యారు. భువి (1), చహల్ (1), ఖలీల్ (1)లు కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడంతో భారత్ ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ 3.. ఫెర్గూసన్, సోధి, సాంట్నర్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు మొదటగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. ఓపెనర్ సీఫర్ట్ 43 బంతుల్లో 6 సిక్సర్లు, 7 ఫోర్లతో 84 పరుగులు చేసి భారీ స్కోరుకు పునాది వేసాడు. మన్రో 34, విలియమ్సన్ 34, టేలర్ 23, కుగెలీన్ 20 పరుగులు చేశారు. వీరందరూ కూడా భారత బౌలింగ్ ను ఊచకోత కోస్తూ.. బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. ఫలితంగా కివీస్ భారీ స్కోర్ చేసింది.