ఇండియా టార్గెట్ 220 పరుగులు

SMTV Desk 2019-02-06 14:37:58  INDvsNZ, T20, Newzeland,India,Rohit sharma, Kane Williamson, Stephen

న్యూజిలాండ్ గడ్డపై వన్డే సిరీస్‌ని 4-1తో చేజిక్కించుకొని చరిత్ర సృష్టించిన భారత్ జట్టుకి టీ 20 మ్యాచ్ లో ఆదిలోనే గట్టి సవాల్ ఎదురైంది. యువ హిట్టర్ టిమ్ సీఫర్ట్ (84: 43 బంతుల్లో 7x4, 6x6) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. విధ్వంసక ఓపెనర్ మార్టిన్ గప్తిల్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన సీఫర్ట్ తొలి ఓవర్‌ నుంచే సిక్సర్ల మోత మోగించి కివీస్‌ని తిరుగులేని స్థితిలో నిలిపాడు. అతని దెబ్బకి మ్యాచ్‌లో నాలుగేసి ఓవర్లు బౌలింగ్ చేసిన భారత్ బౌలర్లు హార్దిక్ పాండ్య (2/57), కృనాల్ పాండ్య (1/37), చాహల్ (1/35), భువనేశ్వర్ (1/47), ఖలీల్ అహ్మద్ (1/48) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో మొత్తం 14 సిక్సర్లు, 14 ఫోర్లు నమోదవడం కొసమెరుపు..
మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే కొలిన్ మున్రో (34: 20 బంతుల్లో 2x4, 2x6) ఫోర్, సిక్స్‌తో ఆ జట్టులో ఉత్సాహం నింపగా.. ఆ తర్వాత సీఫర్ట్ జోరు అందుకున్నాడు. ఎంతలా అంటే.. భువనేశ్వర్, కృనాల్ పాండ్య బౌలింగ్‌లో అతను వరుసగా రెండు సిక్సర్లు బాదేశాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్య, చాహల్‌ బౌలింగ్‌నీ సీఫర్ట్ ఉతికారేశాడు. దీంతో.. తొలి వికెట్‌కి 8.1 ఓవర్లలోనే 86 పరుగుల భాగస్వామ్యం న్యూజిలాండ్‌కి లభించింది. అయితే.. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో కృనాల్ పాండ్య విడదీశాడు. సిక్స్ కోసం ప్రయత్నించిన కొలిన్ మున్రో బౌండరీ లైన్ వద్ద శంకర్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
మున్రో ఔటైన తర్వాత సీఫర్ట్ మరింత దూకుడు పెంచాడు. అతనికి తోడుగా కెప్టెన్ కేన్ విలియమ్సన్ (34: 22 బంతుల్లో 3x6) కూడా బ్యాట్ ఝళిపించడంతో న్యూజిలాండ్‌ జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. మధ్యలో మిచెల్ (8: 6 బంతుల్లో 1x4), గ్రాండ్ హోమ్ (3: 4 బంతుల్లో) నిరాశపరిచినా.. ఆఖర్లో రాస్ టేలర్ (23: 14 బంతుల్లో 2x6), స్కాట్ (20 నాటౌట్: 7 బంతుల్లో 3x4, 1x6) బౌండరీలతో ముగించారు.