ముగిసిన మమతా బెనర్జీ ధర్నా

SMTV Desk 2019-02-06 09:00:15  Mamatha Banerjee, Rajiv Kumar, Sharadha Chitfunds, CBI

కొలకత్తా, ఫిబ్రవరి 06: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధర్నా సుప్రీంకోర్టు ఆదేశాలతో తాత్కాలికంగా సర్దుమనిగింది. శారద చిట్ ఫండ్స్ కుంభకోణం దర్యాప్తులో సీబీఐ విచారణకు హాజరు కావాల్సిందిగా కమిషనర్‌ రాజీవ్ కుమార్ ను సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే, రాజీవ్‌ ను అరెస్టు చేయడం వంటి బలవంతపు చర్యలేవీ చేపట్టకుండా సీబీఐని కోర్టు నిలువరించింది. దీదీకి తీర్పు అనుకూలంగా ఉన్నందున ఆదివారం రాత్రి నుంచి తాను చేపట్టిన ధర్నాను విరమిస్తున్నట్లు మంగళవారం సాయంత్రం ప్రకటించారు.

అయితే, ఈ తీర్పు మమతాకి చెంప పెట్టు అని, సీబీఐకి లభించిన నైతిక విజయమని బీజేపీ వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యం లో రాజీవ్‌ కుమార్‌పై సీబీఐ చర్యలను అడ్డుకోవాలంటూ బెంగాల్‌ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పైన కలకత్తా హైకోర్టు కూడా విచారణ ప్రారంభించి, కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న కారణంగా గురువారం వరకు వాయిదా వేసింది. కాగా రాజీవ్ కుమార్ తన ఉద్యోగ నియమాలను ఉల్లంఘించి క్రమశిక్షణ తప్పి ప్రవర్తించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రం బెంగాల్‌ ప్రభుత్వాన్ని ఆదేశించడం మరో వివాదానికి దారి తీసేలా ఉంది.

శారద చిట్‌ఫండ్‌ కుంభకోణం కేసుకు సంబంధించి సీబీఐకి బెంగాల్‌ పోలీసులు సమర్పించిన సాక్ష్యాలు, ఆధారాలు అసలైనవి కాదనీ, కాల్‌డేటాలో కొంత సమాచారాన్ని తొలగించడం వంటి అక్రమాలు జరిగాయని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. అధికార తృణమూల్‌కు సన్నిహితులు, లేదా సంబంధీకులు చిట్‌ఫండ్‌ కుంభకోణాల కేసుల్లో అరెస్టయ్యారని వేణుగోపాల్‌ కోర్టుకు తెలిపారు. విచారణకు హాజరు కావాలని రాజీవ్‌కు మూడుసార్లు సీబీఐ నోటీసులు పంపినా ఆయన స్పందించలేదని ఏజీ పేర్కొన్నారు.