ఆరోగ్యమే ముందు అంటున్న కేసిఆర్ ప్రభుత్వం

SMTV Desk 2019-02-06 07:49:37  Vote on account budget, Telangana Government, Health Department, KCR

హైదరాబాద్, ఫిబ్రవరి 06: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. అయితే ఈసారి రాష్ట్ర బడ్జెట్ లో వైద్య ఆరోగ్య రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆర్ధిక శాఖ దీనికి సంభందించిన ప్రతిపాదనను సిద్దం చేసింది. ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా వైద్య ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో 2019-20 బడ్జెట్లో వైద్య ఆరోగ్య రంగానికి కేటాయింపులు కూడా అధికంగానే ఉంటాయని తెలుస్తోంది.

దానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా పూర్తయ్యాయని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య రంగానికి రూ.10 వేల కోట్లు కేటాయించనున్నారు. గత బడ్జెట్ లో ఈ రంగానికి ప్రభుత్వం రూ.7,370 కోట్లు కేటాయించింది. వాటితో పాటు ఆరోగ్యశ్రీకి రూ.699 కోట్లు, ఆస్పత్రులను అభివృద్ధిలో భాగంగా రూ. 600 కోట్ల వైద్య పరికరాలను కొనుగోలు చేసింది. ఈ బడ్జెట్ లో గత సంవత్సరం కేటాయించిన దానికంటే రూ. 3కోట్లు ఎక్కువగా కేటాయించనున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం పెంచటానికి బడ్జెట్‌ కేటాయింపుల్లో ప్రధానంగా మాతా శిశు సంరక్షణకు, కేసీఆర్‌ కిట్ల పంపిణీకి ప్రాధాన్యతనిస్తూ వాటికీ నిధులు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.