నెల్లూరు బెట్టింగ్ కేసులో నిన్న నేతలు నేడు పోలీసులు

SMTV Desk 2017-08-02 11:28:34  Cricket betting, Nellore cricket betting case, Nellore, Cricket betting rocket

నెల్లూరు, ఆగష్టు 2: రోజురోజుకు పెరిగిపోతున్న క్రికెట్ బెట్టింగ్ మాఫియా నేపధ్యంలో ఇటీవల నెల్లూరులో పోలీసులు ఒక ముఠాను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ దందాకు పోలీసులు దోహదపడుతున్నారని జిల్లా ఎస్పీ రామకృష్ణ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో నెల్లూరు, గూడూరు డీఎస్పీలు వెంకటరాముడు, శ్రీనివాస్లతో పాటు ముగ్గురు సీఐలపై డీజీపీ కొరడా ఝుళిపించారు. వారిని వీఆర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసారు. అయితే ఈ కేసులో ఇప్పటికే 30మంది బుకీలు, జూదరులను పోలీసులు విచారిస్తుండగా, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల పేర్లు బయటపెట్టినట్లు సమాచారం. ఈ మాఫియా వెనుక వైసీపీ ఎమ్మెల్యేలు, మరికొందరు నేతల పేర్లు బుకీలు వెల్లడించినట్టు పోలీసు వర్గాలు స్పష్టం చేయగా, టీడీపీ వాళ్లను వదిలి వైకాపా నేతలను లక్ష్యం చేస్తున్నారని ఆ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులకు కోట్ల రూపాయలు లంచాలు బుకీలు ఇచ్చారని, ఇందులో కానిస్టేబుళ్ల నుంచి సీఐ, డీఎస్పీ స్థాయి వరకు భాగముందని, ఈ మేరకు టీడీపీ వారిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం విదితమే. వైసీపీ నుంచి ఈ విధమైన ఆరోపణలు వచ్చిన తరుణంలో పోలీసు అధికారులపై వేటు విశేషత సంతరించుకుంది.