ఎన్‌ఆర్‌సీ విషయంలో కేంద్రంపై సుప్రీమ్ కోర్ట్ ఆగ్రహం

SMTV Desk 2019-02-05 17:27:49  NRC, Supreme Court, Ranjan Gogoi, Election commission

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 05: అస్సాంలో నిర్వహిస్తున్న నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్‌ఆర్‌సీ) విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు మండిపడింది. దీన్ని భంగ పరిచేందుకు కేంద్ర హోమ్ శాఖ గత రెండు వారులుగా నానా అవస్థలు పడుతోందని వెల్లడించింది. ఎన్నికల్లో మోహరించడానికంటూ అస్సాంలో ఉన్న 167 కంపెనీల సాయుధ బలగాలను ఉపసంహరించుకుంటామని కోర్టులో కేంద్ర హోంశాఖ పిటిషన్ దాఖలు చేసింది.

సుప్రీమ్ కోర్ట్ ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. కేంద్రం ఎన్‌ఆర్‌సీ అంశంలో సహకరించడం లేదని సుప్రీం అనుమానం వ్యక్తం చేసింది. హోంశాఖ పద్దతిని చూస్తుంటే ఈ ప్రక్రియను నాశనం చేసేలా కనిపిస్తున్నదని చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ ను ఎన్‌ఆర్‌సీ డ్యూటీలో ఉన్న రాష్ట్ర అధికారులను ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని ఆదేశించింది. ఎన్నికలు, ఎన్‌ఆర్‌సీ కలిసి సాగుతాయని కోర్టు స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్‌ఆర్‌సీని కొనసాగించాలని కేంద్రం అనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. ఎన్‌ఆర్‌సీని అయినా నిలిపేయండి అని కేంద్రం కోరింది. దాన్ని కోర్టు నిరాకరించింది.