భద్రాద్రి దేవాలయ అభివృద్ధి తుది నమూనా సిద్ధం.

SMTV Desk 2017-08-02 10:30:34  badraadri temple re-construction

హైదరాబాద్, ఆగష్టు 2 : యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం మాదిరిగానే భద్రాద్రి ఆలయం కూడా కొత్త రూపును సంతరించుకోనుంది. ఈ ఆలయ అభివృద్ధి తుది నమూనా సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకు ఆర్కిటెక్‌ ఆనంద్‌ సాయి అభివృద్ధి నమూనాలను రూపొందించారు. ప్రస్తుత ఆలయ మహారాజ గోపుర నమూనాలో ఎలాంటి మార్పులు చేయకుండానే ఆలయ ప్రాకారం, ఇతరత్రా మార్పులను ఆర్కిటెక్‌ తుది నమూనాలో పొందుపరిచారు. దాదాపు తుది దశకు చేరుకున్న నమునాను వేద పండితులు చినజీయర్‌ స్వామికి చూపించగా ఆయన నమునాను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా నమూనా అద్భుతంగా ఉందంటూ దానిపై తన సందేశం రాసి సంతకం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకు తుది నమూనా ఖరారు కాగానే చినజీయర్‌ స్వామి సలహా తీసుకున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ దేవాలయ పునర్నిర్మాణం కోసం మాడ వీధుల్లో నిర్మాణం చేపట్టడంతో కొందరు ఇళ్ళు కోల్పోతున్నారు. వారికి తగినంత పరిహారం ఇవ్వాలని ఆలయ ఈవోను ఆదేశించినట్లు తెలిపారు. ఈ నమునాకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిన తర్వాత టెండర్లు ఖరారు చేసి, ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు.