సోదరుడి శవాన్ని బైక్ పై ఊరేగించిన వ్యక్తి అరెస్ట్

SMTV Desk 2017-06-01 13:29:54  Police,Tomb,Brazil,Bike

బ్రెజిల్‌, మే 31 : ఎవరైనా మనకు బాగా కావలసిన వ్యక్తి చనిపోయినప్పుడు సాధారణంగా కొన్ని రోజులు ఏడుస్తూ, బాధను తీర్చుకుంటాం. ఆ తర్వాత ఆ వ్యక్తి చివరి కోరికను నెరవేర్చడానికి మన వంతు ప్రయత్నంగా కృషి చేస్తాం. కాని ఒక వ్యక్తి సోదరుడిని విడిచి ఉండలేక అతని సమాధి తవ్వి శవపేటికను బైక్‌పై ఊరేగించిన ఈ విచిత్ర ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుందీ. వివరాల్లోకి వెళ్ళితే 29 ఏళ్ల రోసా ఏడాది క్రితం తన సోదరుడిని కోల్పోయాడు. నాటి నుంచి అన్ననే తలుచుకుంటూ కుమిలిపోతున్నాడు. ఆదివారం రాత్రి తన అన్న శవాన్ని పాతిపెట్టిన ప్రదేశానికి వెళ్లి సమాధి తవ్వాడు. అందులో ఉన్న శవపేటికను బైక్‌పై ఎక్కించుకుని ఊరంతా తిప్పాడు. అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రోసాను అదుపులోకి తీసుకుందామని చాలా యత్నించారు. అయినా అతను ఏమీ పట్టనట్టు వేగంగా బైక్‌పై వెళ్లిపోయాడు. ఎట్టకేలకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ‘నా సోదరుడిని చాలా మిస్సవుతున్నాను.. ఓ రోజు కలలో కన్పించి బైక్‌పై తిరగాలని ఉందని చెప్పాడు.. అందుకే సమాధి తవ్వాను’ అని రోసా చెప్పాడు. అది విని పోలీసులు నిర్ఘాంతపోయారు. ఆ తర్వాత రోసాని అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించగా అక్కడి న్యాయస్థానం అతనికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. శవపేటికను బైక్‌పై పెట్టుకుని తీసుకెళుతున్నప్పుడు కొందరు ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో పెట్టడంతో వైరల్‌గా మారింది.