చిదంబరంకు తప్పని చిక్కులు

SMTV Desk 2019-02-03 17:22:16  Chidambaram, Karthi Chidambaram, Peeter Mukharjiya, Indranee Mukharjiya, CBI, ED, INX Media

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 3: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరంను త్వరలో విచారించనుంది. చిదంబరంను ప్రశ్నించేందుకు సీబీఐకి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అనుమతి మంజూరు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆయనను ప్రశ్నించవలసి ఉందని, ఇందుకు అనుమతి కావాలని సీబీఐ కోరిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే చిదంబరం కుమారుడు కార్తి చిదంబరాన్ని సీబీఐ దర్యాప్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 25న సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లు ఐఎన్ఎక్స్ మీడియా కేసులో పి. చిదంబరంను కస్టడీలోకి తీసుకుని విచారించవలసి ఉందని ఢిల్లీ హైకోర్టుకు తెలిపాయి.

యూపీయే హయంలో పి. చిదంబరం ఆర్థిక మంత్రిగా పని చేసిన కాలంలో ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మండలి అనుమతులు లభించాయి. 2007లో ఐఎన్ఎక్స్ మీడియా విదేశాల నుంచి దాదాపు రూ.305 కోట్ల మేరకు నిధులను తీసుకుంది. ఇది అక్రమమని సీబీఐ 2017 మే 15న కేసు నమోదు చేసింది. ఈ మనీలాండరింగ్ కేసులో పీటర్ ముఖర్జియా, ఇంద్రాణీ ముఖర్జియా ముఖ్య పాత్రులు. ఈ కంపెనీకి అనుమతుల జారీ విషయంలో కార్తి చిదంబరం ప్రమేయం కూడా ఉన్నట్లు సీబీఐ ఆరోపించింది. కార్తికి అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పరోక్ష సంబంధాలు ఉన్నాయని, ఈ కంపెనీతో ఐఎన్ఎక్స్ మీడియా రూ.10 లక్షలు లావాదేవీలు నిర్వహించిందని సీబీఐ ఆరోపించింది. మారిషస్ నుంచి పెట్టుబడులను పొందడానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మండలి నిబంధనలను ఉల్లంఘించినట్లు ఐఎన్ఎక్స్ మీడియాపై ఆరోపణలు నమోదు చేసింది. దీనికి సంబంధించిన దర్యాప్తును తప్పించేందుకు తన పలుకుబడిని కార్తి చిదంబరం వినియోగించినట్లు ఆరోపించింది.