కివీస్ పై భారత్ ఘన విజయం....ఐదు వన్డేల సిరీస్ భారత్ సొంతం

SMTV Desk 2019-02-03 15:20:50  India VS Newzeland, 5th ODI, Ambati rayudu, Hardik pandya, Vijay shankar, ODI Trophy

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 3: న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు చివరి వన్డే వెల్లింగ్టన్ వేదికగా జరుగగా టీం ఇండియా35 పరుగుల తేడాతో కివీస్ పై ఘన విజయాన్ని సాధించింది. దీంతో వన్డే సిరీస్ ట్రోపీని కూడా టీం ఇండియానే కైవసం చేసుకుంది. టీం ఇండియా 18 పరుగులకే నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయిన సమయంలో అంబటి రాయుడు, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. ముఖ్యంగా రాయుడు బాధ్యతాయుత ఇన్నింగ్స్, చివర్లో పాండ్యా మెరుపులతో టీమిండియా 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. రాయుడు 113 బంతుల్లో 4 సిక్స్‌లు, 8 ఫోర్లతో 90 పరుగులు చేయగా.. చివర్లో పరుగుల సునామీ సృష్టించిన పాండ్యా కేవలం 22 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అందులో 5 సిక్స్‌లు, 2 ఫోర్లు ఉన్నాయి. ఈ ఇద్దరికీ తోడుగా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ నిలిచాడు. విజయ్ 64 బంతుల్లో 4 ఫోర్లతో 45 పరుగులు చేశాడు. రాయుడుతో కలిసి ఐదో వికెట్‌కు 98 పరుగులు జోడించి టీమ్‌ను ఆదుకున్నాడు విజయ్ శంకర్. ఆ తర్వాత కేదార్ జాదవ్ (34)తో కలిసి ఆరో వికెట్‌కు 74 పరుగులు జోడించాడు రాయుడు. వన్డేల్లో మరో సెంచరీ చేస్తాడనుకున్న సమయంలో 90 పరుగుల దగ్గర ఓ భారీ షాట్ ఆడబోయి వికెట్ సమర్పించుకున్నాడు. అతడు ఔటైన తర్వాత పాండ్యా మెరుపులు మెరిపించాడు.

ఇక 253 పరుగుల లక్ష్యంతో క్రీజులోకి వెళ్ళిన కివీస్ జట్టు 217 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. జేమ్స్ నీషమ్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే అతను రనౌట్ కావడంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది. చివరి వరుస బ్యాట్స్‌మెన్ పోరాడినప్పటికీ, ఒత్తిడి ఎదుర్కోలేక వరుసపెట్టి పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో చాహల్ 3, షమీ, పాండ్యా తలో రెండు వికెట్లు పడగొట్టారు. బౌలర్లకు చుక్కలు చూపించి న్యూజిలాండ్‌ను విజయానికి దగ్గర చేసిన జేమ్స్ నీశమ్‌ ఔటయ్యాడు. 32 బంతుల్లో 44 పరుగులు చేసిన నీశమ్‌ను ధోనీ రనౌట్ చేశాడు. దీంతో కివీస్ 7వ వికెట్ కోల్పోయింది. ఈ విజయంతో భారత్ 5 వన్డేల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది.