చిక్కుల్లో మోడీ రైతు బందు పథకం

SMTV Desk 2019-02-03 15:19:47  Piyush Goyal, NK Poddhar, Saikath Sinha Roy, Kisan Sanman Nidi

కోల్‌కతా, ఫిబ్రవరి 3: మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన రైతు బంధు తరహా కిసాన్ సమ్మాన్ నిధి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ పథకం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిని అమలు చేయడం అంత సులువు కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఇస్తామని, అందులో మొదటి విడతగా రూ.2 వేలు ఈ ఏడాదే ఇస్తామనీ పియూష్ గోయల్ ప్రకటించారు. ఈ పథకం అమలుకు రూ.75 వేల కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా వేశారు. ఈ రూ.6 వేలు సరిపోతాయా లేదా అన్నది విషయం కాకుండా దీని అమలు చాలా కష్టం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీని అమలుకు న్యాయపరమైన చిక్కులు ఎదురౌతాయని చెప్తున్నారు. భూయాజమాన్య హక్కులపై ఈ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పథకం అమలుకు అడ్డంకిగా మారవచ్చు అని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ ఎన్‌కే పొద్దార్ అన్నారు. రూ.75 వేల కోట్ల మొత్తం ఇలా పంచితే వృథాగా పోయినట్లే అని జాదవ్‌పూర్ యూనివర్సిటీ ఎకనమిక్స్ ప్రొఫెసర్ సైకత్ సిన్హా రాయ్ అభిప్రాయపడ్డారు. ఇదే మొత్తాన్ని పెట్టుబడి సాయంగా లేదా మంచి ధరలు కల్పించడానికి ఉపయోగించవచ్చని, దీని ద్వారా ఆర్థిక లబ్ధి పొందే అవకాశం ఉండేదని ఆయన చెప్పారు.

ఈ కారణంగా ఒక భూమికి ఒకరి కంటే ఎక్కువ మంది యజమానులు ఉంటే ఆ భూమికి సంబంధించి ఎక్కువ మందికి ఆర్థిక సాయం చేయాల్సిన పరిస్థితి కలుగుతుందని రాయ్ తెలిపారు. టైటిల్ డీడ్‌లో ఒకరి పేరున్నంత మాత్రాన ఆ భూమిపై యాజమాన్య హక్కులు అతనికే దక్కవని, న్యాయపరమైన పోరాటంలో ఇతరులు కూడా యాజమాన్య హక్కుల కోసం పోరాడవచ్చని ఈ మధ్య సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ లెక్కన ఒక భూమికి ఒకరి కంటే ఎక్కువ మంది యజమానులు ఉంటే.. అందరూ ఆ రూ.6 వేల సాయం అందుకుంటారని పొద్దార్ చెప్పారు. అందువల్ల మొదటి విడత సాయం రూ.2 వేలు ఇవ్వడం కూడా ఓ సవాలే అని పొద్దార్ స్పష్టం చేశారు.