టాప్ 1లో స్మృతి మంధాన

SMTV Desk 2019-02-03 12:07:26  Smriti Mandhana, number one ranked in ODI cricket, Lizelle Lee, Tammy Beaumont, Stafanie Taylor , Chamari Athapaththu, Amy Satterthwaite

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 3: భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అత్యంత అరుదైన స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ మధ్యే ఐసీసీ నుంచి వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకన్న స్మృతి ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో శతకానికి మించిన స్కోరు 105 సాధించడంతో పాటు 90 పరుగులతో అజేయంగా నిలిచిన మంధాన సిరీస్ టాప్ స్కోరర్‌గా నిలిచి సత్తాచాటింది. దీంతో శనివారం ఐసీసీ ప్రకటించిన మహిళల ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లు పెర్రీ, మెక్ లానింగ్‌లను వెనక్కి నెట్టి ఏకంగా నెం.1 స్థానానికి ఎగబాకింది. గత ఏడాది 12 వన్డేలాడి 669 పరుగులు చేసినందుకుగాను మంధానాకి ఐసీసీ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డ్ లభించిన విషయం తెలిసిందే.





2018 ఆరంభం నుంచి ఇప్పటి వరకూ 15 వన్డేలాడిన ఈ భారత ఓపెనర్ రెండు సెంచరీలతో పాటు ఎనిమిది హాఫ్ సెంచరీలను సాధించింది. తాజాగా 751 పాయింట్లతో ర్యాంకింగ్స్‌లో స్మృతి అగ్రస్థానంలో నిలవగా.. ఆ తర్వాత పెర్రీ (681) మెక్ లానింగ్ (675) టాప్-3లో ఉన్నారు. ఇటీవలే కెరీర్‌లో 200 వన్డేల మైలురాయిని అందుకున్న భారత క్రికెట్ మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ 669 పాయింట్లతో ఐదో స్థానానికి పడిపోయింది. బౌలింగ్ విభాగంలో 639 పాయింట్లతో సీనియర్ ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి నాలుగో స్థానంలో నిలవగా.. స్పిన్నర్లు పూనమ్‌ యాదవ్‌ ఎనిమిది, దీప్తి శర్మ తొమ్మిదో స్థానాల్లో ఉన్నారు.