యాత్ర ఆడియో ఎలా ఉందంటే

SMTV Desk 2019-02-03 11:48:14  Yathra, YSR Biopic, Mammotty,

దివంగత నేత వైఎస్సార్ బయోపిక్ గా వస్తున్న సినిమా యాత్ర. మహి వి రాఘవ్ డైరక్షన్ లో 70 ఎం.ఎం. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను విజయ్ చిల్లా, శషి దేవి రెడ్డి నిర్మించారు. వైఎస్ చేసిన పాదయాత్రలో ఆయన ఎలాంటి అనుభూతి పొందారో ఈ సినిమా చూపించనున్నారు. ఈ సినిమాకు కే (కృష్ణ కుమార్) మ్యూజిక్ అందించారు. సింగిల్ కార్డ్ గా సిరివెన్నెల సీతారామశాస్త్రి యాత్ర సినిమాకు అద్భుతమైన 5 పాటలు అందించారు. ఒక్క పాటని పెంచల్ దాస్ రాసి పాడటం జరిగింది. ఫిబ్రవరి 8న తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సాహిత్యం, సంగీతం రెండు అద్భుతంగా కుదిరాయి.

సమరశంఖం, మందితో పాటుగా ముందుకే సాగనా, పల్లెల్లో కళ ఉంది, రాజన్నా నిన్ను ఆపగలరా, నీరాక కోసం పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయడం జరిగింది. మరుగైనావ రాజన్నా పాటని పెంచల్ దాస్ స్వయంగా రాసి ఆయనే పాడారు.

సమరశంఖం :

రాజశేఖరుడు పాదయాత్రకు నడుం బిగించడానికి బలపరిచేలా వచ్చే సందర్భంలో ఈ పాట వస్తుంది. సిరివెన్నెల రచించిన ఈ పాటని కాలభైరవ పాడటం జరిగింది. తండ్రి రాజా రెడ్డి కన్న కలని నిజం చేసి లక్ష్యం దిశగా అడుగు వేసిన సందర్భంలో ఈ పాట అందరిని అలరిస్తుంది.

మందితో పాటుగా ముందుకే సాగనా :

పాదయాత్ర జరుగుతున్న సందర్భంలో ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు రాజన్నపై ప్రజలు చూపిస్తున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని తనలో మెదిలే భావాలతో ఓ అద్భుతంగా అనిపిస్తుంది ఈ పాట. సాయి చరణ్ పాడిన ఈ పాటని సిరివెన్నెల రచించడం జరిగింది.

పల్లెల్లో కళ ఉంది :

రైతు కష్టాలను.. రైతు గోడుని వినిపించే పాట ఇది.. నిత్య దారిద్యం వెంటాడుతున్న రైతు బ్రతుకు గురించి రాజన్న తెలుసుకునే నేపథ్యంలో వచ్చే పాట పల్లెల్లో కల ఉంది.. ఎస్బి బాలసుబ్రహ్మణ్యం ఈ పాట పాడగా.. సిరివెన్నెల సాహిత్యం అందించారు.

రాజన్నా నిన్ను ఆపగలరా :

రాజన్న పాదయాత్రలో ప్రజలతో ఏకమై ఆయనకు ప్రజల నుండి అందుతున్న అపూర్వ స్వాగతాలు.. ప్రజల స్పందన గురించి తెలిపే పాట రాజనా నిన్ను ఆపగలరా.. వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన ఈ పాటని కూడా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాయడం జరిగింది.

నీరాక కోసం :

శంకర్ మహదేవన్ పాడిన ఈ పాట సిరివెన్నెల రచించడం జరిగింది. మహా నాయకుడు కోసం ప్రజలు ఎదురుచూస్తూ.. నీ వెంట నడిచే సైన్యం అవుతాం అంటూ ఆయనకు ఘన స్వాగతాలు పలికే సందర్భంలో వచ్చే ఈ పాట అద్భుతంగా అనిపిస్తుంది.

మరుగైనావ రాజన్నా :

రచయిత పెంచల్ దాస్ రాసి, పాడిన ఈ పాట వైఎస్ మరణ వార్త విని ఆయన అభిమానులు గుండె పగిలేలా ఏడుస్తూ పాడే పాటగా వైఎస్ మీద అభిమానంతో పెంచల్ దాస్ ఈ పాట రాయడం.. ఆయనే పాడటం జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లైవ్ లో ఈ పాట పాడి అందరి కళ్లు చెమర్చేలా చేశారు పెంచల్ దాస్.