జయరాం హత్యకేసు : హంతుకుడు అతడే

SMTV Desk 2019-02-03 11:05:04  NRI Jayaram, Express TV Chairman, Murder Case, Mystery, Chigurupati jayaram, Shikha chaudary

హైదరాబాద్, ఫిబ్రవరి 3: ఎన్నారై చిగురుపాటి జయరాం చౌదరి హత్య కేసు మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు చేధించారు. జయరాం మేనకోడలు శిఖా చౌదరి స్నేహితుడు రాకేశ్ రెడ్డికి జయరాం రూ. 4.5 కోట్లు అప్పు తీర్చేది ఉంది. దీనికి సంబంధించిన విభేదాల కారణంగా రాకేశ్ రెడ్డి ఆయనను చంపినట్లు సమాచారం. జయరాంను హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకెళుతూ కారులోనే రాకేశ్ రెడ్డి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కారు వెనుక సీట్లోనే జయరాంను కొట్టి చంపినట్లు భావిస్తున్నారు. మద్యం మత్తులో ఉండగానే హత్య చేసి దీనిని ప్రమాదంగా చిత్రీకరించి ఐతవరం వద్ద రోడ్డు పక్కన కారును వదిలి రాకేశ్ రెడ్డితో పాటు మరో వ్యక్తి పారిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. మాదాపూర్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ నుంచి రాకేశ్ రెడ్డి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. అయతే ఈ హత్యలో జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి పాత్ర ఉందా లేదా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాకేశ్‌రెడ్డి.. శిఖా చౌదరికి బాయ్‌ఫ్రెండ్ అతని వద్ద నుంచి ఆమె రూ.4.5 కోట్లు అప్పు తీసుకుంది. వీరిద్దరి మధ్య రుణం విషయమై గత కొంతకాలంగా గొడవ జరుగుతూ వస్తోంది.





ఈ సందర్భంలోనే మేనకోడలి డబ్బును తాను చెల్లిస్తానని చిగురుపాటి సెటిల్‌మెంట్ చేశాడని తెలుస్తోంది. డబ్బు తీసుకుంది శిఖా చౌదరి.. అప్పు తీర్చాల్సింది కూడా ఆమె. అలాంటప్పుడు శిఖా చౌదరిని వదిలిపెట్టి జయరామ్‌ను రాకేశ్ రెడ్డి ఎందుకు చంపాడన్నది అంతుచిక్కని ప్రశ్న. నందిగామ పోలీస్ స్టేషన్‌లో ఉన్న శిఖా చౌదరిని కలవడానికి కబాలి చిత్ర నిర్మాత కెపి చౌదరి ఎందుకొచ్చాడు. శిఖా చౌదరి తల్లి సుశీలను పీఎస్‌కు ఎందుకు పిలిపించారు... ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. శిఖాను ఈ కేసు నుంచి తప్పించడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. చిగురుపాటి జయరామ్‌కు సంబంధించిన ఆర్ధిక లావాదేవీలన్నీ శిఖా చౌదరి కనుసన్నల్లోనే ఉండటం ఇంకా ఆమె పోలీసుల అదుపులోనే ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది.