రాజీనామాల బాట పట్టిన టిఆర్ఎస్ నేతలు

SMTV Desk 2019-02-02 15:43:51  Nizamabad MP Kavitha, Resignation, Harish Rao, TBGKS, TMU

హైదరాబాద్, ఫిబ్రవరి 2: టిఆర్ఎస్ ముఖ్య నేతలు రాజీనామా బాట పట్టారు. ఇటీవల మంత్రి హరీష్ రావు టిఎంయూ పదవికి రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నిజామాబాద్ ఎంపి కవిత కూడా హరీష్ రావు దారిలోనే నడుస్తున్నారు. తాజాగా కవిత తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు. కొన్నేళ్లుగా టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న కవిత, టిఆర్ఎస్ ప్రజాప్రతినిధిగా ఉంటూ కార్మిక సంఘాలకు నాయకత్వం వహించడం ద్వారా ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని భావించి రాజీనామా ప్రకటించారు.

అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటం, తిరిగి నిజామాబాద్ నుంచి కవిత పోటీ చేయనున్న నేపథ్యంలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర బొగ్గుగని కార్మిక సంఘంతో పాటు విద్యుత్ కార్మిక సంఘం, అంగన్‌వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ అసోసియేషన్, గుర్తింపు పొందిన పాఠశాల యాజమాన్య సంఘాల గౌరవ అధ్యక్ష పదవులకు కూడా కవిత రాజీనామా చేశారు. ఆయా సంఘాల ప్రధాన కార్యదర్శులకు కవిత తన రాజీనామా లేఖలను అందజేశారు.